తమిళనాడులో శశికళ మళ్లీ అలజడి రేపుతున్నారు. ఈ రోజుకు అన్నాడీఎంకే ఏర్పడి యాభై ఏళ్లు అవుతోంది. పార్టీకి ఇప్పటి వరకూ భారీ ప్రజాకర్షక నేత అధ్యక్ష బాధ్యతల్లో ఉంటూవచ్చారు. ఇప్పుడు ఎవరూ లేరు. కానీ ఆధిపత్యం కోసం పోరాటం మాత్రం ప్రారంభమయింది. రాజకీయాలకు ఇక దూరమన్న శశికళ ఇప్పుడు అన్నాడీఎంకే తనదేనంటూ రంగంలోకి దిగిపోయారు. శనివారమే ఆమె అన్నాడీఎంకేలో రచ్చ చేసేశారు. జయలలిత సమాధికి నివాళులు అర్పించి .. తనను అన్నాడీఎంకే నుంచి ఎవరూ దూరం చేయలేరని ప్రకటించారు.
అన్నాడీఎంకే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని.. ఇక నుంచి అందరం కలిసి కాపాడుకుంటామని ప్రకటించారు. శశికళ వ్యాఖ్యలు తమిళ నాట హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకంటే అన్నాడీఎంకే నుంచి శశికళను ఎప్పుడో బహిష్కరించారు. ఆమెకు పార్టీలో చోటు లేదని అటు పన్నీరు సెల్వం.. ఇటు పళని స్వామి చాలా సార్లు ప్రకటించారు. శశికళ ప్రకటన తర్వాత కూడా అదే చెప్పారు. అన్నాడీఎంకేకు శశికళ సేవలు అవసరం లేదన్నారు. కానీ శశికళ అంతర్గతంగా ఇప్పటికే ఆపరేషన్ పూర్తి చేశారు. ఈపీఎస్, ఓపీఎస్లను పక్కకు పెట్టేసి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
ప్రస్తుతం అన్నాడీఎంకేతో పొత్తులో ఉన్న బీజేపీ కూడా శశికళ అన్నాడీఎంకే బాధ్యతలు చేపట్టడానికి సానుకూలంగా ఉంది. అసలు ఆమె విడుదలకు కూడా బీజేపీ సహకారం ఉందన్న ప్రచారం ఉంది. శశికళ అన్నాడీఎంకే పగ్గాలు చేపడితే ఆమె వర్గానికి చెందిన ఐదు శాతం ఓటు బ్యాంక్ కలసి వస్తుందని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. అందుకే ఆమెను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. దానికి తగ్గట్లుగానే శశికళ గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. అందుకే ఏ క్షణమైనా అన్నాడీఎంకే శశికళ చేతుల్లోకి వెళ్లవచ్చన్న ప్రచారం జరుగుతోంది.