భారత రాష్ట్ర సమితి వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీకి పరోక్ష మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఫలితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి బీజేపీకి పెను సవాల్ గా మారింది. టీచర్స్, పట్టభద్ర ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచిన తర్వాత ఇప్పుడా పార్టీకి పట్టపగ్గాలుండవు. ఆ పార్టీ మొదటి టార్గెట్ బీఆర్ఎస్, ముఖాముఖి పోరును ఖరారు చేసుకునే దశలో బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయడానికి చేయాల్సినదంతా చేస్తుంది. అందులో సందేహం ఉండదు.
బీజేపీ మళ్లిన బీఆర్ఎస్ ఓటు బ్యాంక్
తెలంగాణ ఉద్యమానికి కాంక్రీట్ గోడలా సపోర్టుగా నిలబడిన ఉత్తర తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాలు సాధించింది. చాలా నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. అక్కడ తీవ్రంగా నష్టపోయింది బీఆర్ఎస్ మాత్రమే. ఉద్యమ సమయంలో అక్కడ బీఆర్ఎస్కు తిరుగు ఉండేది కాదు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి మరింతగా దిగజారింది. బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి వెళ్లిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం ఉన్నా పోటీ చేయకపోవడంతో మొదటికే మోసం వచ్చింది. పోరు అంతా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుందన్న వాతావరణం ఏర్పడింది.
బీజేపీ కోసం కరిగిపోవడమే బీఆర్ఎస్ వ్యూహమా ?
ఎలా చూసినా.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఏ మాత్రం సమస్య కాదు. అది ప్రత్యర్థి పార్టీ అవుతుంది. కానీ బీజేపీ అలా కాదు. బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీగా పోరుకు సిద్ధమవ్వాలని అనుకుంటోంది. బీఆర్ఎస్ బలాన్ని తన బలంగా మార్చుకుని వెళ్తోంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్.. తనను బీజేపీ నుంచి కాపాడుకోవాలి. ఓటు బ్యాంకు బీజేపీ వైపు వెళ్లకుండా చూసుకోవాలి. కానీ నిజంగా చేస్తోంది. బీజేపీకి మరింతగా సహకరిస్తోంది. ఆ పార్టీ బలోపేతానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది నిజంగా ఆశ్చర్యకరమే. కానీ కేసీఆర్కు తప్పడం లేదు.
కాంగ్రెస్ పై ఎంత వ్యతిరేకత పెరిగినా అది బీజేపీకే లాభం!
బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీపై పోరాడుతోంది. దాని వల్ల కూడా బీజేపీకే లాభం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకత బీజేపీకే లాభిస్తోంది. ఆ పార్టీనే బలపడుతోంది. ఇప్పుడు ఉత్తరతెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ను మించి ప్రభావం చూపిస్తోంది. బీఆర్ఎస్ ఇలాగే వ్యవహరిస్తే దక్షిణ తెలంగాణలోనూ అదే పని చేస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ కు ఎక్కడా అవకాశం ఉండదు. అందుకే బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల్ని తక్షణం మార్చుకోవాల్సిన అవసరం ఉంది.