ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధర్మాబాద్ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై భాజపా నాయకురాలు పురందేశ్వరి స్పందించారు. చంద్రబాబుపై కేంద్రం ప్రభుత్వం గుర్రుగా ఉంది కాబట్టి, భాజపా పాలిత రాష్ట్రం నుంచే తాజా సమన్లు రావడంతో అందరూ ఆ పార్టీ వైపే వేలెత్తి చూపించే పరిస్థితి ఉంది కదా అనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్తూ… దీనికీ భాజపాకీ ఎలాంటి సంబంధం లేదని ఆమె కొట్టి పారేశారు. ఎందుకు ఇలా వారెంట్ ఇష్యూ అయిందనే విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, లేదా సంబంధిత మేజిస్ట్రేట్ ని అడిగి తెలుసుకోవాలని ఆమె సూచించారు.
ఏం జరిగినా కేంద్రం కుట్ర అనడం సరికాదన్నారు. ఇది కేంద్రానికి సంబంధం లేని అంశమనీ, మహారాష్ట్ర కోర్టులో ఉన్న అంశమని పురందేశ్వరి అన్నారు. మహారాష్ట్రలో భాజపా అధికారంలో ఉంది కాబట్టే, ఈ నోటీసులు వచ్చాయనడం సరికాదన్నారు! చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనీ, వారి చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తే ఎలా అని మీడియాని ప్రశ్నించారు? ఆపరేషన్ గరుడ అంటే ఏంటో తమకు తెలీదనీ, అలాంటి ఏదైనా ఉంటే గనుక దానికి భాజాపాతో ఎలాంటి సంబంధం లేదనీ, తమ పార్టీ నుంచి అలాంటి ఆపరేషన్లు ఏవీ జరగడం లేదని పురందేశ్వని కొట్టి పారేశారు. తమపై అనవసరంగా అభాండాలు వేస్తున్నారనీ, ఆరోపణలు చేస్తున్నవారు ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని వ్యాఖ్యానించారు.
పొత్తు నుంచి టీడీపీ బయటకి వచ్చిన తరువాత భాజపా సహకరించడం లేదన్నది ఏమాత్రం సరైంది కాదని పురందేశ్వరి అన్నారు! ఏయే అంశాలపై తాము సహకరించడం లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. అంశాలవారీగా సహకారం గురించి మాట్లాడితే… దానిపై వివరించే అవకాశం తమకూ ఉంటుందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అనీ, దాని నిర్మాణానికి తామే అడ్డుపడుతూ ఉంటే అంతిమంగా తమకే ఇబ్బంది అవుతుంది కదా అన్నారు! ప్రతీ విషయంలోనూ కక్ష అనేది ఆపాదించడం ఆమోదయోగ్యం కాని అంశమని పురందేశ్వరి అన్నారు. తమపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో తామూ వ్యూహాత్మకంగానే ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు.