దుండగుల దాడుల్లో ధ్వంసమైన ఆలయాలు అన్నింటినీ చూస్తేందుకుయాత్ర చేస్తానని ప్రకటించిన చినజీయర్ స్వామి… ఆ యాత్రను ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నారు. దీంతో ఏపీలో రాజకీయ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయప్రముఖులతో సన్నిహితంగా ఉండే స్వాముల్లో చినజీయర్ ఒకరు. ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆస్థాన స్వామిజీ. అలాగే.. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పని గట్టుకుని మరీ వచ్చి.. శంషాబాద్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో రెండు, మూడు రోజుల పాటు పూజలు..ధ్యానాలు చేసి వెళ్తూంటారు. రాజకీయంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న స్వామి … రాజకీయంగా కలకలం రేపుతున్న అంశంపై ధాటిగా స్పందిస్తే… ఖచ్చితంగా విశే్షమే అవుతుంది.
దానికి తగ్గట్లుగానే ఆయన ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశంలో యాక్టివ్ అయ్యారు. అన్ని ఆలయాలను పరిశీలించబోతున్నారు. అయితే ఇందులో ఉన్న విశేషం ఏమిటటే.. దాడులకు గురైన ఆలయాలన్నింటినీ పరిశీలించారని బీజేపీ నేతలు కూడా నిర్ణయించారు. ఇందు కోసం రథయాత్ర చేయాలనుకున్నారు. ఆ రథయాత్ర రూట్ మ్యాప్ ఖరారు కోసం… ఆదివారమే విశాఖలో సమావేశం అవుతున్నారు. అదే రోజు నుంచి చినజీయర్ యాత్ర ప్రారంభించబోతున్నారు. చినజీయర్ యాత్ర.. కాస్త కదలిక తీసుకువస్తుందని.. దాన్ని రాజకీయ యాత్ర ద్వారా తాము.. బలంగా మార్చుకుంటామని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీకి మేలు చేయడానికే.. చినజీయర్ యాత్ర చేస్తున్నాడని చెప్పలేం కానీ.. ఆయన యాత్రను.. తమకు అనుకూలంగా మల్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్న విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదన్న చర్చ జరుగుతోంది. అయితే చినజీయర్‌కు ఉన్న పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నేపధ్యంలో ఆయన యాత్రను విడిగా చూడాల్సిన అవసరం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. చినజీయర్ యాత్రను ఏపీ సర్కార్ కూడా అడ్డుకునే అవకాశం లేదు. అలా అడ్డుకుంటే అది మరింత వివాదాస్పదం అవుతుంది. అదే సమయంలో.. బీజేపీ యాత్రనూ అడ్డుకున్నా.. రాజకీయ వివాదం అవుతుంది. అందుకే ఈ యాత్రల విషయంలో ఏం చేయాలన్నదానిపై వైసీపీ హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది.