ఒక రాష్ట్ర గవర్నర్ ప్రజల్లోకి పనిగట్టుకుని వెళ్లే కార్యక్రమం పెట్టుకోవడం, సమస్యలు వింటానంటూ బయలుదేరడం అనేది సాధారణంగా కనిపించదు. ఎవరైనా రాజ్ భవన్ కి వచ్చి, వినతి పత్రాలు ఇస్తే తీసుకుంటూ స్పందిస్తామని మాట్లాడటం మాత్రమే ఇంతవరకూ మనం చూసింది. అయితే, ఇప్పుడు తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ్టి (సోమవారం) నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజాబాట పేరుతో రాష్ట్రంలో పర్యటనకు సిద్ధమయ్యారు. మూడు రోజులపాటు నాలుగు జిల్లాల్లో పర్యటిస్తారు. ఆలయాల సందర్శన, ప్రజా సమస్యల్ని వినడం, కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నారు. గవర్నర్ పర్యటనకు భాజపా శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం! ఇంతకీ, ఇలా ప్రజాక్షేత్రంలోకి గవర్నర్ ని పంపించడం వెనక భాజపా రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా… అంటే, అవుననే అనిపిస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కేసీఆర్ ని గద్దె దింపి, అధికారంలోకి రావాలన్నది భాజపా రాజకీయ లక్ష్యం. దాన్లో భాగంగా వ్యూహాత్మకంగా ఒక్కో అడుగూ వేసుకుంటూ వస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయడానికి దొరికే ఏ చిన్న అవకాశాన్నీ భాజపా నేతలు ఈ మధ్య అస్సలు వదలడం లేదు. ఇప్పుడీ గవర్నర్ పర్యటన కూడా ఓరకంగా కేసీఆర్ కి ఇబ్బంది కలిగించే అవకాశమే ఉంది. ఎలా అంటే… రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత కేసీఆర్ ఇంతవరకూ ప్రజల దగ్గరకి వెళ్లింది లేదు. సమస్యలు తెలుసుకున్నదీ లేదు. ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ లకు పరిమితం అవుతున్నారనే విమర్శ ఉంది. ఇప్పుడు గవర్నర్ ప్రజల్లోకి వెళ్తే ఏమౌతుందీ… సహజంగానే కొన్ని సమస్యలు ఆమెకు ప్రజలు వివరిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనో, కేసీఆర్ పరిపాలన బాగులేదనో విమర్శలు కొంతమంది నుంచి ఉంటాయి.
మీ సమస్యలు మేం తీరుస్తామంటూ గవర్నర్ హామీ ఇస్తే ఏం జరుగుతుందీ…. ముఖ్యమంత్రి కంటే గవర్నర్ బెటర్ అనే చర్చ మొదలయ్యేందుకు ఆస్కారం ఉంటుంది కదా! కాళేశ్వరంతో సహా ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది టి. భాజపా నేతల ఆరోపణ. ఈ నేపథ్యంలో తమిళిసై కాళేశ్వరం సందర్శిస్తారు. అక్కడి గిరిజనులతో మాట్లాడితే… కనీసం కొందరైనా కేసీఆర్ మీద విమర్శలు చేస్తారు కదా! తమిళిసైని ప్రజాబాట పేరుతో ప్రజల్లోకి పంపించడం వెనక భాజపా రాజకీయ వ్యూహం ఇదే అనిపిస్తోంది. కేసీఆర్ మీద ఏదో ఒకరకమైన ఒత్తిడి తీసుకుని రావాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది.