తెలంగాణలో సీఎల్పీ విలీనంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత డీలాపడుతున్న పరిస్థితి! అసెంబ్లీలో ఉనికి లేకుండా చేసింది అధికార పార్టీ తెరాస. అయితే, రాష్ట్రంలో ఈ ప్రహసనం ఒక పక్క జరుగుతూ ఉంటే… దీనిపై భాజపా నేతలు అస్సలు స్పందించడం లేదు! సీఎల్పీ విలీనం అనేది ఆ రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారంగానే చూస్తున్నారు. అసెంబ్లీలో భాజపాకి ఉన్న ప్రాతినిధ్యం ఒక్కటంటే ఒక్కటే సీటు కదా. అయినాసరే, తెలంగాణలో అధికార పార్టీ తెరాసకు తామే ప్రత్యామ్నాయం అంటూ ఈ మధ్య భాజపా నేతలు ప్రకటనలు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు దక్కించుకున్న దగ్గర్నుంచీ… భాజపా నెక్ట్స్ టార్గెట్ ఈ రాష్ట్రమేననీ, పార్టీ విస్తరణపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా, మొన్ననే కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణం చేసొచ్చిన కిషన్ రెడ్డి కూడా చెప్పారు. అలాంటప్పుడు, తెలంగాణలో తెరాసపై విమర్శలు చేసేందుకు ఆస్కారం ఉన్న ఏ అంశంపై అయినా భాజపా బలంగా గొంతు వినిపించాలి కదా! కానీ, ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు..?
కాంగ్రెస్ నేతల్ని ఒక్కొక్కరిగా తెరాస కలుపుకోవడం.. తెలంగాణలో భాజపాకి ఓరకంగా కలిసొచ్చే అంశంగానే వారు చూస్తున్నట్టున్నారు! ఎందుకంటే, తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడితే… కొద్దోగొప్పో మిగులున్న ఆ నాయకుల్ని భాజపా ఆకర్షించే అవకాశం వస్తుంది కదా. తెలంగాణలో భాజపా విస్తరణకు ఇదే ప్రాతిపదికగా మార్చుకోవచ్చు కదా. తెరాసలోకి వెళ్లలేనివారు, కేసీఆర్ రానివ్వనివారూ కొందరుంటారు కదా! ఇప్పటికే, తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గ నేతలకు భాజపా గాలం వేస్తోందని సమాచారం! పార్టీలో కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా భాజపా నుంచి ఆఫర్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి. దీన్ని రేవంత్ దగ్గర కొంతమంది మీడియా మిత్రులు ప్రస్థావిస్తే… తనకు ఎలాంటి ఆఫర్లూ రాలేవనీ, వచ్చినాసరే భాజపాలో చేరే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేయాల్సి వచ్చింది. ఇది భాజపా ఆడుతున్న మైండ్ గేమ్ గా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు!
తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయిపోతే… ఆ పార్టీలోని రెడ్లు ఎలాగూ తెరాసలోకి వెళ్లలేరు కాబట్టి, మనమే తలుపుతు తీసి ఉంచితే… పార్టీకి మేలు అనే అభిప్రాయంతో రామ్ మాధవ్ ఉన్నారనీ తెలుస్తోంది! ఆ దిశగానే తెలంగాణ నేతలకు సంకేతాలు ఇస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే, ఫిరాయింపు రాజకీయాలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నా… దానిపై తెరాసను విమర్శించే ఆస్కారం ఉన్నా కమలనాథులు స్పందించడం లేదు! కాంగ్రెస్ ఎంత బలహీనపడితే, భాజపాకి అంత లాభం ఉంటుందనే ఆశతో ఉన్నట్టున్నారు..!!