కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ.. భారతీయ జనతా పార్టీ చాలా రోజులుగా నినాదం వినిపిస్తోంది. దేశంలో అసలు కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనేది.. బీజేపీ లక్ష్యం. చివరి వరకూ వచ్చింది. పంజాబ్ లాంటి రాష్ట్రంలో మినహా..ఎక్కడా కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసే ప్రయత్నాలు చేసింది. కానీ.. చివరిలో.. మూడురాష్ట్రాల్లో బీజేపీ పరాజయం పాలవ్వడంతో.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కు ఊపిరి వస్తోంది. అలాంటి సమయంలో.. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదంపై.. దేశవ్యాప్తంగా.. చర్చ జరిగింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసి.. నియంతృత్వానికి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. అందుకే… తాము కాంగ్రెస్‌ను నిర్మూలించాలనుకోవడం లేదని… ఆ పార్టీ సిద్ధాంతాలనే నిర్మూలించాలనేది తమ ఉద్దేశమని కవర్ చేశారు. కాంగ్రెస్ సిద్దాంతాలు, కాంగ్రెస్ వాదం అంటే.. బీజేపీ అంత కోపం, కసి. మరి ఇప్పుడెందుకు.. అదే వాదానికి.. అదే సిద్ధాంతానికి భారతరత్న ఇచ్చారు..?
కానీ…అదే కాంగ్రెస్ వాదాన్ని జీవితాంతం పాటించిన ప్రణబ్ ముఖర్జీలో భారతరత్నాన్ని చూసింది బీజేపీ ప్రభుత్వం. 1969లో ఆయన కాంగ్రెస్ తరపున రాజకీయాల్లోకి వచ్చారు. మిడ్నపూర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి వీకే కృష్ణమీనన్ తరఫున ప్రచారం చేస్తూ నాటి ప్రధాని ఇందిరా గాంధీ దృష్టిలో పడ్డారు. 1969 జూలైలో ఆయనను ఇందిరాగాంధీ రాజ్యసభకు పంపించారు. 1973లో ఇందిర మంత్రివర్గంలో చేరారు. 1984లో ఇందిర హత్యానంతరం.. అనుభవం లేని రాజీవ్‌గాంధీ కంటే తానే ఇందిరకు అసలైన వారసుడినని ప్రణబ్ భావించారు. అయితే ప్రధాని పదవి రాజీవ్‌కు దక్కడంతో.. రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పేరిట ప్రణబ్ వేరే పార్టీ స్థాపించారు. 1989లో దిగివచ్చి తిరిగి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1991లో రాజీవ్‌గాంధీ హత్యానంతరం ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు.. ప్రణబ్‌ముఖర్జీని ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా, 1995లో విదేశాంగ మంత్రిగా నియమించారు. 1998లో సోనియా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంలో ప్రణబ్ కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రణబ్ తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012లో రాజీనామా చేసేవరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్నారు. 2012-17 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు.ఒక్క ప్రధాని, కేంద్ర హోంశాఖ తప్ప అన్ని పదవులనూ అలంకరించి.. వన్నె తెచ్చిన వ్యక్తి. 23ఏళ్ల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సభ్యుడు. ప్రణబ్ మాత్రమే కాదు.. ఆయన తండ్రి సైతం కాంగ్రెస్ వాదే.
ఇందిర నుంచి మోదీ వరకూ ఎందరో ప్రధానులతో కలిసి ప్రణబ్ ముఖర్జీ పని చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ప్రణబ్‌కు ఇందిర రాజకీయ అండదండ అందించారు. అందుకే ఇందిరా గాంధీయే తన రాజకీయ గురువని వీడ్కోలు సమావేశంలోనూ తెలిపారు. ఆమె ఉన్నప్పుడు ప్రణబ్ ప్రభ వెలిగిపోయేది. అందుకే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విషయాన్ని అస్సలు విమర్శించరు. ఇలాంటి అత్యున్నత కాంగ్రెస్ వాదానికి శిఖరం లాంటి ప్రణబ్ ముఖర్జీకి… కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం వినిపిస్తున్న నరేంద్రమోడీ.. భారతరత్నం ఇచ్చారు. అంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం… ఎక్కడి దాకా అయినా వెళ్తానని మోడీ నిరూపించారు.