దేశంలో ఉన్న ప్రతి వైఫల్యంపైనా స్పందించాలంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నోటి నుంచి మొదటగా…కాంగ్రెస్ పార్టీ ప్రస్తావనే వస్తుంది. తను అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గిపోయిన వృద్ధి రేటు దగ్గర్నుంచి… వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టకపోవడం వరకూ..మొత్తం కాంగ్రెస్ పార్టీనే కనిపిస్తోంది. ఆయన బాటలోనే ఆయన శిష్యులు, వందిమాగధులు పయనిస్తున్నారు. నోట్ల రద్దు వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం పూర్తిగా కుదేలయిందని… దాని వల్ల నిరుద్యోగం పెరిగి… వృద్ధిరేటు క్షీణించిందని.. ఢక్కా మొక్కీలు తిన్న ఆర్థిక వేత్తలందరూ చెబుతున్నారు. కానీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ మాత్రం..మోడీ బాటలో పయనిస్తున్నారు. నోట్ల రద్దు వల్ల… వృద్ధిరేటు మందగించలేదు. అంతకు ముందే పదవి విరమణ చేసిన రఘురాం రాజన్ వల్లే… వృద్ధిరేటు తగ్గిపోయిందట.
ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నప్పుడు రఘురామ్ రాజన్ తీసుకున్న నిర్ణయాల వల్లే బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరిగిపోయాయని చెబుతున్నారు. అందుకే దేశ ఆర్ధిక వృద్ధిరేటు మందగమనంలో ఉందన్నారు. నిరాశాజనక వృద్ధి రేటుకు నోట్ల రద్దు కారణం కాదంటున్నారు రాజీవ్ కుమార్. ఏడాదికేడాదికి బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరిగిపోతున్నాయని, దీని వల్ల నిరర్ధక ఆస్తులు విపరీతంగా పేరుకుపోయాయని చెబుతున్నారు నీతి ఆయోగ్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో 4 లక్షల కోట్లుగా ఉన్న నిరర్ధక ఆస్తులు.. 2017కి వచ్చే సరికి 10.5 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు. అయితే ఇదంతా అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తీసుకున్న నిర్ణయాల కారణంగానేనంటున్నారు రాజీవ్‌కుమార్. ఆయన తీసుకున్న నిర్ణయాలతో బ్యాంకులు పరిశ్రమలకు రుణాలు ఇవ్వలేదంటున్నారు.
ఆర్ధిక వృద్ధి రేటు మందగమనానికి నోట్ల రద్దు కారణం కాదేనంటున్నారు. 2015-16 ఆర్ధిక సంవత్సరం కంటే ముందునుంచే వృద్ధి రేటు తగ్గుతూ వస్తోందని.. దాని కారణంగానే ప్రస్తుత మందగమనమన్నారు. అయితే రాజీవ్ కుమార్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను రఘురామ్ రాజన్‌పై వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకు పోవడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. ఇప్పుడు ఆయన శిష్యులు రంగంలోకి దిగారు. అంతే తేడా.!