భారతీయ జనతా పార్టీ తన చేతకాని తనాన్ని కశ్మీర్లో స్వయంగా బయటపెట్టుకుంది. తమను మించిన దేశభక్తులు లేరన్నట్లుగా.. తాము వస్తే కశ్మీర్ అంతా హాయిగా ఉంటుందన్నట్లుగా బీజేపీ ప్రచారం చేసుకుంది. తీవ్రవాదులు… తమ పేరు వింటేనే భయపడరతారని… రాళ్లు వేసేవాళ్లు… ఇంట్లో నుంచి బయటకు రారని చెప్పుకొచ్చింది. ఒక్క కశ్మీర్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ ప్రచారం చేసుకుంది. పీపుల్స్ డెమెక్రటిక్ ఫ్రంట్ తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఏం జరిగింది..?. కశ్మర్లో పరిస్థితులు ఏ మాత్రం మెరుగుపడకపోగా.. రోజు రోజుకు దిగజారిపోయాయి. కాల్పులు, ఆందోళనలు జరగని రోజంటూ లేకుండా పోయింది. గతంలో పాకిస్థాన్ జెండాలు కనిపించేవి కావు. కానీ కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత.. కశ్మీర్ లో పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక… అక్కడ పాకిస్థాన్ జెండాలు ప్రదర్శించడానికి ఎవరూ భయపడటం లేదు. పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయిన తర్వాత నెపం అంతా.. పీడీపీ మీద తోసేసి.. బీజేపీ వైదొలిగింది. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తున్నట్లు రామ్మాధవ్ ప్రకటించడంతో.. బీజేపీ చేతులెత్తేయడం పూర్తయినట్లు అయింది.
నిజానికి కశ్మీర్ ఇలా రగిలిపోవడానికి బీజేప వ్యవహారశైలే కారణం. కశ్మీర్లో అధికారం పొందాలనే లక్ష్యంతో సిద్ధాంత పరంగా ఏ మాత్రం పొసగని పీడీపీతో పొత్తుకు సిద్ధపడింది. పాకిస్థాన్ తో చర్చలు పునఃప్రారంభించడం, ఆర్టికల్ ౩70 రద్దు డిమాండ్ ను పక్కనపెట్టడం, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రాష్ట్రం నుంచి ఉపసంహరించడం పీడీపీ ప్రధానమైన సిద్ధాంతాలు. కానీ వీటికి భిన్నంగా బీజేపీ ఎన్నికలలో వాగ్దానాలు చేసింది. ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి బిజెపి హిందూత్వ ఎజెండాలో ప్రాధమిక అంశాలు. వీటిపై జమ్మూ-కాశ్మీర్ ఎన్నికలలో బిజెపి ప్రచారం చేసింది కూడా. కానీ పీడీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ వీటన్నింటినీ పక్కన పెట్టేసింది.
చివరకు శాంతిభద్రతలు క్షీణించాయనే కారణం చూపి… ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది బీజేపీ. మూడేళ్ల నుంచి జమ్మూకశ్మీర్లో శాంతి భద్రతలు దిగజారాయని బీజేపీ జమ్మూకశ్మీర్ ఇన్చార్జ్ రామ్ మాధవ్ చెప్పుకొచ్చారు. ఈ మూడేళ్లు బీజేపీ ప్రభుత్వం భాగస్వామి కానట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. రంజాన్ మాసంలో సీనియర్ జర్నలిస్ట్ షూజిత్ బుఖారి హత్యకు గురి కావడం కూడా తాము మద్దతు ఉపసంహరించుకోవడానికి ఒక కారణమని బీజేపీ చెబుతోంది. పీడీపీ ప్రభుత్వం నుంచి వైదొలుగుతూ.. ప్రభుత్వం నిందలన్నీ ముఖ్యమంత్రి ముఫ్తీపైనే మోపింది బీజేపీ. కశ్మీర్లో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నించామని బీజేపీ చెప్పుకొచ్చింది. పీడీపీ మాత్రం తన వాగ్దానాలను నిలబెట్టుకోలేదట. అభివృద్ధి పనుల పీడీపీ నుంచి భాజపా నేతలకు ఇబ్బందులు ఎదురయ్యాయట.
నిజానికి కశ్మీర్లో పరిస్థితులు దిగజారిపోవడానికి బీజేపీ నేతల వ్యవహారశైలే కారణం. కథువాలో చిన్నారి అత్యాచార ఘటన తర్వాత బీజేపీ నేతలు, మంత్రులు .. నిందితులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహించారు. కశ్మీర్ యువతను రెచ్చగొట్టెటట్లుగా వ్యవహిరంచారు తప్ప.. వారిలో మార్పు కోసం ప్రయత్నించలేదు. దాని వల్లే పరిస్థితులు దిగజారిపోయాయి. మొత్తానికి తన చేతకాని తనాన్ని పీడీపీపై నెట్టి బీజేపీ బయటపడింది.