పరిస్థితులు పూర్తిగా మారిపోయి చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అన్న నమ్మకం మోడీకి వస్తే తప్ప బిజెపి-టిడిపి బంధం నిలబడే అవకాశం అయితే కనిపించడం లేదు. మోడీ-బాబుల బంధం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు అని బలంగా కోరుకునే వెంకయ్యనాయుడు కూడా 2019 పొత్తుల గురించి ఇప్పుడే ఏం మాట్లాడతాం అన్నారంటే వాస్తవ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. బిజెపి నాయకులకు అయితే చంద్రబాబుకు కటీఫ్ చెప్పాలన్న ఉబలాటం చాలా ఎక్కువే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే పొత్తు ధర్మాన్ని విస్మరించి మరీ చంద్రబాబుకు నష్టం చేసేలా జగన్‌కి ప్లస్ అయ్యేలా మాట్లాడుతున్నారు. తెలంగాణాలో కూడా టిడిపితో పొత్తు విషయంలో ధర్మం తప్పి మరీ ఇష్టారీతిగా మాట్లాడేస్తున్నారు అక్కడి నాయకులు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆశ్ఛర్యకరంగా అన్ని అవమానాలను భరించడానికే సిద్ధపడుతున్నారు.
కర్నూలులో వైకాపా నేత దారుణ హత్యకు గురవగానే జగన్‌తో సహా వైకాపా నాయకులందరూ కూడా చంద్రబాబుపైన విమర్శల వర్షం కురిపించడానికి రెడీ అయిపోయారు. పరిటాల రవి హత్యకు గురైనప్పుడు చంద్రబాబు చేసిన రాజకీయమే ఇఫ్పుడు జగన్ కూడా చేస్తున్నాడు. అయితే ఆశ్ఛర్యకరంగా జగన్ చేస్తున్న రాజకీయానికి బిజెపి నుంచి మద్ధతు వస్తుండడం టిడిపి నేతలను ఇబ్బందిపెడుతోంది. పురంధేశ్వరి లాంటి నేత ఫ్యాక్షన్ని మళ్ళీ రెచ్చగొడుతున్నారు అని పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం టిడిపికి నష్టం చేసేదే. మిగతా బిజెపి నాయకులు కూడా ఏమీ తగ్గడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంపైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. బిజెపి నేతల డ్రామా అంతా చూస్తుంటే బాబుకు కటీఫ్ చెప్పడానికి సరైన కారణం కోసం వెతుకుతున్నారా అన్న అనుమానం వస్తోంది. ఏం కారణం చెప్పి బాబుకు కటీఫ్ చెప్తారా…….సీమాంధ్ర ప్రజల అభివృద్ధి కోసమే పొత్తుకు బ్రేకప్ చెప్పాం…..రాజకీయ స్వార్థం అస్సలు లేదు అని ప్రజలను ఎలా నమ్మిస్తారో చూడాలి మరి.