తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ నుంచి ఓ లీక్ తెలంగాణకు వచ్చింది. ఒక్క సారిగా బ్లాస్ట్ అయింది. అయితే రెండు పార్టీల్లోని నేతలు స్పందించలేదు. రెండు రోజులుగా ఈ ప్రచారం జరుగుతున్నా అంతా మౌనం పాటించారు. కానీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్సి బండి సంజయ్ మాత్రం స్పందించారు. బీఆర్ఎస్ తో పొత్తును మెడ మీద తలకాయ ఉన్న వారు పెట్టుకోరని ప్రకటించారు. అది కిషన్ రెడ్డిపై ఆయన అసంతృప్తి అన్న ప్రచారం కూడా ఉంది.
ఎన్డీఏలోకి చేర్చుకునేది లేదని స్వయంగా ప్రధాని చెప్పారని బండి సంజయ్ అంటున్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పటి మాట అప్పటిదే. మోదీ కూడా దానికి అతీతం కాదు. బండి సంజయ్ పొత్తులపై మాట్లాడిన వెంటనే మాజీ మంత్రి మల్లారెడ్డి బండి సంజయ్ తో అయ్యేదీ లేదు.. పొయ్యేదీ లేదన్నారు. పొత్తులు ఉన్నా లేకపోయినా తన కుమారుడు మల్కాజిగిరి లోక్ సభ సీటు నుంచే పోటీ చేస్తారని ప్రకటించారు. అంటే.. పొత్తును ఖండించలేదు సరి కదా ఉండవచ్చన్నట్లుగా మాట్లాడారు. పార్టీ హైకమాండ్ నుంచి సిగ్నల్స్ లేకపోతే ఇలాంటి వివాదాస్పద అంశంపై ఇలా తేలికగా స్పందించే అవకాశం ఉండదు.
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని పార్టీ నేతల అభిప్రాయాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఆ పార్టీ లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీతో పొత్తుపై ఢిల్లీ స్థాయిలో చర్చలు నడుస్తున్నాయని కూడా అంటున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నందున.. పార్టీని కాపాడుకోవడం సహా.. అనేక సమస్యల పరిష్కారం కోసం పొత్తులు మేలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇది నిజం కావడానికే ఎక్కువ అవకాశం కనిపిస్తోందని పరిణామాలు నిరూపిస్తున్నాయి.