యుపి భాజపా నేత దయాశంకర్ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిని ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడిన వ్యవహారాన్ని ఆ పార్టీ రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తుంటే భాజపా కూడా ఆ పార్టీని అడ్డుకోవడానికి పావులు కదపడం మొదలుపెట్టింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలున్నాయి. దేశంలోకెల్లా అత్యధిక శాసనసభ, ఎంపి స్థానాలున్న కారణంగా ఆ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకి చాలా ముఖ్యమైనవే. కనుక ఆ ఎన్నికలలో గెలిచేందుకు అన్ని పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.
తమ పార్టీ అధినేత్రి మాయావతి పట్ల అనుచితంగా మాట్లాడిన దయాశంకర్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బి.ఎస్.పి.కార్యకర్తలు మొన్న లక్నోలో ధర్నా చేశారు. పోలీసులు హామీ ఇచ్చిన తరువాత దానిని విరమించారు. కానీ మళ్ళీ అదే కారణం, అదే డిమాండ్ తో బి.ఎస్.పి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడానికి సిద్ధం అవుతోంది.
దయాశంకర్ ని పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ భాజపానేతల మాటలలో ఎక్కడ పశ్చాత్తాపం కనబడటం లేదని, కనుక దయాశంకర్ ని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని ఆ పార్టీ నేత సునీల్ చితోర్ మీడియాకి చెప్పారు.
భాజపా నుంచి బహిష్కరింపబడిన దయాశంకర్ భార్య స్వాతి సింగ్ బి.ఎస్.పి.అధినేత్రి మాయావతి, ఆమె ముఖ్య అనుచరుడు నసీముద్దీన్ సిద్దికీ, మరో ఇద్దరిపై లక్నోలో హజరత్ గంజ్ పోలీస్ స్టేషన్లో నిన్న పిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం వారు లక్నోలో ధర్నాలు చేస్తున్నప్పుడు తన గురించి, తన 12 ఏళ్ల వయసున్న కుమార్తె గురించి చాలా అసభ్యంగా మాట్లాడారని, తమకి ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారని పిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నా భర్త అనుచితంగా మాట్లాడినందుకు మాయావతి బాధపడుతునట్లే, బి.ఎస్.పి. నేతలు నా గురించి, నా కుమార్తె గురించి మాట్లాడిన మాటలకి మేము కూడా చాలా బాధపడుతున్నాము. మాయావతికి అవమానం జరిగిందని గగ్గోలు పెడుతున్న వాళ్ళు మాగురించి అదేవిధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మాయావతికి అవమానం జరిగినందుకు పార్లమెంటులో అందరూ చాలా బాధపడ్డారు. మరి నాకు జరిగిన అవమానం గురించి, బి.ఎస్.పి. నేతల వేధింపుల గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు? నేను కూడా మాయావతిలాగే ఒక మహిళని. బి.ఎస్.పి. నేతల వేధింపుల కారణంగా నా కుమార్తె మానసికంగా చాలా దెబ్బతింది. రోజూ నిద్రమాత్రలు వేస్తే కానీ నిద్రపోలేకపోతోంది. దీనికంతటికి కారణమైన మాయావతిని, ఆమె అనుచరులని తక్షణమే అరెస్ట్ చేసి చట్టప్రకరం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను,” అని అన్నారు.
ఆమెకి భాజపాయే పరోక్షంగా సహకరిస్తోందని, అందుకే ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో అసహజమేమీ లేదు. బి.ఎస్.పి. చేస్తున్న అందోళనల వలన నష్టం కలుగుతోంటే భాజపా చేతులు ముడుచుకొని కూర్చోదు కదా!