తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్ష పదవికి తీవ్రమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే, ఢిల్లీ నుంచి ఒక కమిటీ హైదరాబాద్ కి వచ్చి, ఎవరికి పదవి ఇవ్వాలనే అంశమై దాదాపు 35 మంది నేతలతో వ్యక్తిగతంగా ఓ మూడ్రోజుల కిందటే సమావేశమైంది. పాండే, అనిల్ జైన్ అనే నాయకులు దానికి సంబంధించిన నివేదిక కూడా పార్టీ జాతీయ నాయకత్వానికి అందించినట్టు సమాచారం. ఈ నివేదిక చూసి.. ఢిల్లీ నాయకత్వం కాస్త ఆశ్చర్యానికి గురైందని తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం ఇంతమంది పోటీ పడుతున్నారా? అధ్యక్ష పదవి అంటే ఆషామాషీగా భావిస్తున్నారా..? పేర్లను సూచించే ముందు రాష్ట్ర స్థాయిలో నాయకులు చర్చించుకోరా, ఏకాభిప్రాయం లాంటిది ఉండదా, రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తోంది అంటూ కొంతమంది నేతలకు ఢిల్లీ నుంచి అక్షింతలుపడ్డట్టు సమాచారం.
ఢిల్లీ నుంచి వచ్చి వెళ్లిన పరిశీలకులకు రాష్ట్ర నేతలు కొందరు… వారికి ఢిల్లీలో తెలిసిన ప్రముఖ నేతలతో ఫోన్లు చేయిస్తున్నారని తెలిసింది. తమ పేరునే ప్రముఖంగా పార్టీ నాయకత్వానికి చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారనీ అంటున్నారు. ఈ ఒత్తిడి భరించలేక, సదరు కమిటీ సభ్యులు పార్టీ అధినాయకత్వానికి విషయం తెలియజేశారని సమాచారం. దీంతో, తెలంగాణ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నవారు… తమ పరిధిలో ఎన్నెన్ని బూత్ కమిటీలు వేశారో, పార్టీ కోసం వాస్తవంగా ఏం చేశారో, వారికి ఉన్న అర్హతలు ఏంటో తెలుసుకోవాలంటూ సదరు కమిటీ సభ్యులను పార్టీ అధినాయకత్వం కోరిందని అంటున్నారు.
తమ పేరును పరిశీలించాలంటూ హైదరాబాద్ కి వచ్చిన పరిశీలకులను కూడా బతిమాలుకునే పరిస్థితిలో తెలంగాణ నేతలు ఉండటమేంటని ఢిల్లీ నేతలు కొందరు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. తెలంగాణ నేతలకు పదవి విషయంలో ఉన్న సీరియస్నెస్… పార్టీ విస్తరణపై పెడితే గడచిన కొన్నాళ్లుగా జరిగిన వరుస ఎన్నికల్లో ఏదో ఒక దాన్లో మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవారనే అభిప్రాయం జాతీయ నాయకుల్లో వ్యక్తమౌతోందని వినిపిస్తోంది. మొత్తానికి, ఆశావహులందరి అర్హతలు ఏపాటివో తేల్చే పనిలో పార్టీ పడిందని భాజపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇవన్నీ దగ్గరపెట్టుకుని వరుసగా క్లాసులు తీసుకుంటారేమో..?