జగన్ సర్కార్ను ఉపేక్షించేది లేదని వారిపై యుద్ధం చేయడానికి సిద్దంగా ఉన్నామని.. కానీ తమకు సైన్యం కావాలని ఏపీ బీజేపీ అంటోంది. అప్పుడెప్పుడో ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు .. ఇంత ఘోరమైన పాలన ఏపీలో జరుగుతూంటే ఎందుకు పోరాడటం లేదని.. పాలనా వైఫల్యాలు, అరాచకాలపై చార్జిషీట్లు వేయాలని దిశానిర్దేశం చేసి వెళ్లారు. కానీ సోము వీర్రాజు పట్టించుకోలేదు. ప్రధాని మాటలనే పట్టించుకోరా అన్న హెచ్చరికలు రావడంతో హడావుడిగా.. చార్జిషీట్ల ఉద్యమం అని ప్రారంభించారు.
కానీ …ఎక్కడా స్పంద కనిపించడం లేదు. ఆపార్టీకి ఉన్న క్యాడర్ అంతంతమాత్రం. వారిలోనూ బయట తిరగడానికి ఆసక్తి చూపేవారు అతి కొద్దిగా ఉంటారు. ఎవరూ ఈ చార్జిషీట్ల గురించి పట్టించుకోవడం లేదు. దీంతో సోము వీర్రాజు రూటు మార్చారు. తమకు ప్రజల మద్దతు కావాలని.. పిలుపునిస్తున్నారు. బీజేపీతో కలిసి వైసీపీపై చార్జిషీటు వేయాలనుకుంటే తమ ఫిర్యాదులను ఇవ్వొచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారు. పార్టీ కార్యాలయాల్లో చార్జిషీట్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
అయితే వైసీపీ సర్కార్ నడవడం వెనకు ఉన్నది బీజేపీనేనని ప్రజలందరికీ గట్టి నమ్మకం. ఒక్క నెల అప్పులు ఆపేసినా ఇక్కడ జగన్ సర్కార్ కూలిపోతుంది. ఆ విషయంపైనా ప్రజలకు క్లారిటీ ఉంది. అలాంటప్పుడు.. వీరు వైసీపీపై పోరాడుతున్నారు అని చెబితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉంటారన్నది కీలక విషయం. తమ వెనుక ఉన్న మచ్చ గురించి సోము వీర్రాజుకు తెలియడం లేదో..తెలిసి కూడా పై వాళ్లకు చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారో కానీ.. ఏ పని చేసినా బీజేపీని ప్రజలు నమ్మేలా చేయడం లేదు.