తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికల్ని రాజకీయ పార్టీలు అత్యంత సీరియస్‌గా తీసుకున్నాయి. అధికారపార్టీకి మరింత అడ్వాంటేజ్ ఉంది. ఈ అడ్వాంటేజ్‌ను వాడుకోవడంలో టీఆర్ఎస్ ఏ మాత్రం మొహమాటపడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల కిందట హైదరాబాద్ శివార్లలో రెండు కార్లలో తరలిస్తున్న రూ. 40 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఒక రోజు తర్వాత పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి ఆ సొమ్ము బీజేపీ అభ్యర్థి రఘునందన్‌దిగా ప్రకటించారు. దానికి సంబంధించిన ఆడియో టేపులు కూడా ఉన్నాయన్నారు. దీంతో రఘునందన్ రావు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి..కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
తన ఫోన్ , తన సిబ్బంది ఫోన్‌కాల్స్‌ని ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని..ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ల ట్యాపింగ్‌పై విచారణ జరపాలని రఘునందన్‌రావు హోంమంత్రి అమిత్ షాను.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు.. తెలంగాణ పోలీస్ విభాగం ట్యాపింగ్ చేస్తోందన్నారు. దీనికి సాక్ష్యంగా అక్టోబర్ 5న జరిగిన సంఘటన ద్వారా ఇది రుజువైందని రఘునందన్ చెబుతున్నారు. రఘునందన్ పీఏ ఇలా డబ్బులు తీసుకొచ్చేలా ఆదేశాలిస్తున్న ఆడియోలను పోలీసులు బయట పెట్టారు. ఉపఎన్నిక నేపధ్యంలో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి వ్యూహాలను కనుక్కుంటోందని.. వారికి ఆర్థిక సాయం ఎక్కడ నుంచి అందుతుందో తెలుసుకుని.. పోలీసుల సాయంతో పట్టుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సారి నేరుగా బీజేపీ అభ్యర్థికే ఈ పరిస్థితి ఎదురవడం.. ఆయన నేరుగా కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో .. కేంద్రం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అనేది నిరూపించలేని అంశమని అనధికారికంగా చేస్తూంటారని… రాజకీయవర్గాలకు బాగా తెలిసిన విషయం . కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తేల్చాలనుకుంటే.. పెద్ద విషయం కాదు. మరి సొంత పార్టీ అభ్యర్థి కోసం కేంద్రం రంగంలోకి దిగుతుందో లేదో వేచి చూడాలి.. !