గౌతం గంభీర్ అంటే.. దూకుడుగా ఆడే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ మన కళ్ల ముందు ఉంటారు. వ్యక్తిత్వంలోనూ అదే దూకుడు. వరుస వివాదాస్పద వ్యవహారాలతో.. క్రికెట్‌కు దూరం కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌గా… రాజకీయాల్లోకి వచ్చారు. పాకిస్తాన్ పై.. వివాదాస్పద కామెంట్లు చేసి… రాజకీయంగా గుర్తింపు తెచ్చుకుని బీజేపీలో చేరిపోయారు. బీజేపీ అభ్యర్థిగా ఈస్ట్ ఢిల్లీ నుంచి బరిలో నిలిచారు. కానీ ఇప్పుడు.. నాకు అనుభవం లేదు… నన్ను వదిలేయండి.. అని.. విమర్శకులతో విరుచుకుపడుతున్న వారిని బతిమాలుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయారు.
గంభీర్‌కు ఢిల్లీలో రెండు చోట్ల ఓట్లున్నాయి. నామినేషన్ రోజే… అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు. రూల్స్ తెలియకుండా గేమ్ ఆడుతున్నారని.. గంభీర్‌పై ఆప్ అభ్యర్థి సెటైర్లు వేస్తున్నారు. అంతే కాదు… విజన్‌పై బహిరంగ చర్చకు రావాలని గౌతీని డిమాండ్ చేశారు. కానీ గంభీర్ తోసిపుచ్చారు. డిబేట్లు అంటే ఇష్టం లేనప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అంటూ నిలదీశారు. ప్రజాస్వామ్యంలో డిబేట్లే కీలకమనే సంగతిని… గుర్తు చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో గంభీర్ తడబడుతున్నారు. ఆప్ అభ్యర్థి అతిషి విమర్శలు ఎక్కుబెడుతున్న తీరు చూస్తుంటే.. ఈ మాజీ ఓపెనర్‌కు ఎన్నికల బ్యాటింగ్ అంత తేలికేం కాదని తెలిసొస్తోంది. తాను రాజకీయాలకు కొత్త అని.. తనపై వస్తున్న విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో అర్థం చేసుకోలేకపోతున్నానని.. గంభీర్.. వాపోతున్నారు.
ఢిల్లీలో… ఆమ్ ఆద్మీ పార్టీ.. పూర్తి స్థాయిలో క్యాడర్ ఏర్పాటు చేసుకుంది. తనకు ఉన్న చాలా పరిమితమైన అధికారాలతోనే.. ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను కేజ్రీవాల్ చేపట్టారు. దాంతో… ప్రజల్లో ఆప్ కు పలుకుబడి ఉంది. అదే సమయంలో.. బీజేపీపై వ్యతిరేకత ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం మూడు సీట్లకే పరిమితం అయింది. దానికి కారణం.. ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయడానికి అమిత్ షా చేసిన చేరికల వ్యూహం ప్రజల్లో వ్యతిరేకత పెంచింది. ఆ వ్యతిరేకత ఇంకా కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ.. అభ్యర్థులు.. సాధారణ నేపధ్యం ఉన్న వారు కావడం కూడా.. ప్రజల్లో కలసి పోవడానికి కారణం అవుతోంది. అదే బీజేపీ అభ్యర్థులను.. ముఖ్యంగా గంభీర్ ను కూడా టెన్షన్ పెడుతోంది.