పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని రెండు నెలలు దాటేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరిన 50 రోజుల గడువూ పూర్తయింది. భాజపా సర్కారు ‘చారిత్రకం’ అని అభివర్ణించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమలు చేయడం ద్వారా… సామాన్యులను నానా అగచాట్లకు గురి చేసి మరీ అమలు చేయడం ద్వారా కేంద్రం సాధించింది ఏంటీ..? నల్లధనం నాశనమైపోయిందా..? ఉగ్రవాదం ఊడలు తెగిపోయారా..? దేశమంతా క్యాష్ లెస్ అయిపోయిందా..? పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనకున్న లక్షాలు ఇవే అని చెప్పారు! లేదా, వీటిలో ఏదో ఒకటైనా కావొచ్చు. సరే, ఏదైతేనేం… ‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో మోడీ సర్కారు ఏం సాధించింది’ అనే ప్రశ్న సామాన్యుల నుంచి మెల్లగా మొదలౌతున్న తరుణమిది. ఈ సమయంలో ప్రస్తుతం భాజపా ముందు రెండే రెండు ఆప్షన్లున్నాయి. ఒకటీ వాస్తవాలు మాట్లాడాలి. కష్టనష్టాలను చర్చించుకోవాలి. అది ఆత్మహత్యా సాదృశ్యం! రెండోది… మోడీ సర్కారు ఏదో సాధించేసిందని ప్రచారం చేసుకోవాలి. ఇది ఈజీ మార్గం. అందుకే రెండో మార్గంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు!
పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని రాష్ట్రాలు నెత్తీనోరూ బాదుకుంటూ ఉంటే… అబ్బెబ్బే, అదేం లేదూ కేంద్ర ఆదాయం అద్భుతంగా పెరిగిపోయిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంబరాలు చేసుకుంటున్నారు. కేంద్ర పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయంటూ హర్షం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో తయారీ రంగం పూర్తిగా దెబ్బ తినేసిందని అఖిల భారత మ్యానిఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఓ నివేదికలో వెల్లడిస్తే… దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అది తప్పుడు నివేదిక అనేశారు. అక్కడితో ఆగినా బాగుండేది. ఆ రంగంలో సెంట్రల్ ఎక్సైజ్ పన్ను అద్భుతంగా వసూలైందనీ, 31.6 శాతం పెరిగిందని అరుణ్ జైట్లీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చిత్రం ఏంటంటే… కేంద్ర పన్నుల వసూళ్లలో పాతనోట్ల లేవని ఆయన చెప్పడం!
ఇక, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యక్తం చేస్తున్న ఆనందం ఏంటంటే.. వ్యవస్థలో ఉన్న సొమ్మంతా బ్యాంకుల్లోకి వచ్చేసిందని ఆయన అన్నారు. తాజాగా ఆంధ్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశాన్ని సమూలంగా మార్చేందుకు నరేంద్ర మోడీ సిద్ధమౌతున్నారన్నారు. సొమ్మంతా బ్యాంకు ఖాతాల్లోకి వచ్చేయడమే గొప్ప విజయం అంటూ ఆయన ఓ పక్క నుంచీ ప్రచారం మొదలుపెట్టేశారు.
మొత్తానికి, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత భారతీయ జనతా పార్టీ ఏదో సాధించిందని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం సాధించిందో వారికీ స్పష్టంగా తెలీడం లేదు! అందుకే, ఒకరేమో పన్నుల వసూళ్లు బాగా పెరిగిపోయాయని అంటుంటే, మరొకరు బ్యాంకుల్లోకి డబ్బులు వచ్చేశాయని సంబర పడిపోతున్నారు. ఇంతకీ, ఏం సాధించినట్టు..? సామాన్యుడికి ఏం ఒరిగినట్టు..?