రజనీకాంత్ రాజకీయాల్లోకి “త్వరలో” వస్తున్నాడు. ఈ డైలాగ్ గత 20 యేళ్ళుగా వినిపిస్తూనే ఉంది కానీ ఆ “త్వరలో” ఎప్పుడో ఎవరికీ తెలీదు. అయితే జయలలిత మరణం తర్వాత రజనీకాంత్ బాగా యాక్టివ్ కావడం, మోడీ సపోర్ట్ రజనీ కి ఉందని ప్రజలు భావించడం చూసి బిజెపి సపోర్ట్ తో రజనీ 2019 లో ఆరంగేట్రం చేయడం ఖాయమని అంతా భావిస్తూ వచ్చారు. అయితే సడెన్ గా ఇప్పుడు బిజెపి రజనీ పై ఆశలు వదులుకుందనే వాదన మొదలైంది. పలువురు విశ్లేషకులు ఈ తరహా వ్యాఖ్యలు 2 జీ తీర్పు తర్వాత షురూ చేసారు.
దక్షిణాదిన బలపడాలనేది బిజెపి చిరకాల వాంఛ. జయ మరణం తర్వాత పన్నీర్ వర్గాన్ని బిజెపి దువ్వడం, మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యేలని రిసార్టులో పెట్టుకుని సీఎం పదవి కోసం చకోర పక్షి లా ఎదురు చూసిన శశికళ జైలు పక్షి అవడమూ, దీనివెనుకా బిజెపి హస్తం ఉందని తమిళులు భావించడం, ఆ తర్వాత పన్నీర్ బలం అర్థమై, రజనీ ని తెర పైకి బిజెపి యే తెచ్చిందన్న విమర్శలు రావడం, దానికి తగ్గట్టుగానే రజనీ కూడా బిజెపి ని పల్లెత్తు మాట అనకపోవడమూ తెలిసిందే. అయితే రజనీ అన్నింటికీ మల్లగుల్లాలు పడుతూ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నాడు. మరి దీంతో రజనీ విషయం లో బిజెపి ఏమైనా పునరాలోచనలో పడిందేమోనన్న సందేహాలు వస్తున్నాయి.
ఇక ఇప్పుడు డిఎంకె నేతలు నిష్కళంకులుగా కేసుల నుంచి బయట పడటం, అదీ సరిగ్గా ఉప ఎన్నికల రోజున తీర్పు రావడం తో పలువురు సామాన్యులు, విశ్లేషకులు, కొందరు రాజకీయ నాయకులు, డిఎంకె కి బిజెపి తో పొత్తు ఖాయమని విశ్లేషించడం మొదలు పెట్టారు. కొద్ది రోజుల క్రితమే డిఎంకె లీడర్స్ తో మోడీ ప్రత్యేకంగా భేటీ కావడం, దక్షిణాదిన బలోపేతం కావడానికి బిజెపి గత కొంత కాలంగా ప్రయత్నిస్తూండటం తో ఈ అనుమానాలకి మరింత ఊతం వస్తోంది. టివి చర్చల్లో పాల్గొంటున్న బిజెపి నాయకులు సైతం డిఎంకె బిజెపి పొత్తు ఊహాగానాల విషయమై ఖండించకపోగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని వ్యాఖ్యానించడం గమనార్హం. వీటన్నింటిని బట్టి చూస్తుంటే, ఒకవేళ బిజెపి గనక డిఎంకె తో వెళ్ళాలని నిర్ణయించుకుంటే రజనీ ని లైట్ తీసుకోవడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరి అదే జరిగితే బిజెపి మద్దతు లేకపోయినా రజనీ రాజకీయాల్లోకి వస్తాడా? అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చేంత ధైర్యం రజనీ చేస్తాడా? ఈ వయసు లో అతని ఆరోగ్యం అంత ఒత్తిడికి సహకరిస్తుందా? లేక తన మనస్తత్వానికి రాజకీయాలు సరిపడవు అని అభిమానులని ప్రిపేర్ చేసి, సినిమాల్లో సూపర్ స్టార్ గా కొనసాగుతాడా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తమిళనాటే కాక దక్షిణ భారతమంతా వినిపిస్తున్నాయి. కానీ బిజెపి గనక డిఎంకె తో పొత్తు పెట్టుకుంటే, “కథానాయకుడు” పై “పన్నీరు” చల్లే ప్రక్రియకి కమలం స్వస్తి పలికినట్టేనని, “శివాజీ” పై బిజెపి ఆశలు వదులుకున్నట్టేనని నిర్ధారణకి రావచ్చు.