బిహార్ శాసనసభ ఎన్నికలు మొదలయ్యే రెండు,మూడు నెలల ముందు నుండి మొన్న రెండవ దశ ఎన్నికల వరకు బీజేపీ తరపున ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీయే ఎన్నికల ప్రచారం చేసారు. బిహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లను ధీటుగా ఎదుర్కోగల, అంతగా ప్రజాధారణ కలిగిన నేతలు బీజేపీకి లేకపోవడంతో ఈ ఎన్నికలలో బీజేపీ పూర్తిగా నరేంద్ర మోడిపైనే ఆధారపడవలసి వస్తోంది. సాధారణంగా ఏదయినా ఒక రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతుంటే స్థానిక పార్టీలు, నేతలు కీలక పాత్ర పోషిస్తారు. వారికి మద్దతుగా జాతీయ స్థాయి నేతలు వచ్చి ప్రచారం చేసి వెళుతుంటారు. కానీ బిహార్ లో మాత్రం పోటీ ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీకి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్య జరుగుతున్నట్లుంది. బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన గురించి ప్రచారం చేసుకొని ప్రజలను ఓట్లు అడుగుతుంటే, జనతా పరివార్ నితీష్ కుమార్ పరిపాలన గురించి ప్రచారం చేసుకొని ఓట్లు అడుగుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం వలన రాష్ట్రంలో బీజేపీకి చాలా సానుకూల వాతావరణం ఏర్పడింది. బీజేపీ విజయావకాశాలు గణనీయంగా పెరిగాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో బీజేపీ చాలా ఆశ్చర్యకరమయిన నిర్ణయం తీసుకొంది. ఇక నుండి నరేంద్ర మోడి ప్రచారాన్ని తగ్గించి, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, రాష్ట్ర నేతల చేతనే ఎక్కువగా ప్రచారం చేయించాలని నిర్ణయించుకొంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారు కానీ ఇదివరకు అంత కాదు. ఎంపిక చేసిన కొన్ని నియోజక వర్గాలలో, కొన్ని సభలలో మాత్రమే పాల్గొంటారు. ఇంత వరకు రెండు దశలు ఎన్నిలకు పూర్తయ్యాయి. ఇంకా మరో మూడు దశలలో ఎన్నికలు జరుగవలసి ఉంది. సరిగ్గా ఎన్నికల మధ్యలో బీజేపీ ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకొందో తెలియదు కానీ ఇటువంటి నిర్ణయాలు ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపుతాయని చెప్పవచ్చును.
సాధారణంగా ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించినప్పుడు ఆ అప్రదిష్ట తమకు చుట్టుకోకూడదనే ఉద్దేశ్యంతో అగ్ర నేతలు ఎన్నికల ప్రచారం నుంచి మెల్లగా తప్పుకొంటుంటారు. ఇంతవరకు చాలా ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు అలాగే చేయడంతో ఈ అవకాశాన్ని నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ వెంటనే అందిపుచ్చుకొని నరేంద్ర మోడి తమ పార్టీ ఓటమిని అప్పుడే అంగీకరించేసారని పెద్దగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
బీజేపీ రాష్ట్ర నేతలు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వారి ప్రచారాన్ని అడ్డుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ వీలుపడటం లేదు. ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేస్తున్నప్పుడు జనతా పరివార్ ఆత్మరక్షణలో పడిపోతే, ఇప్పుడు బీజేపీ అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లను ఎదుర్కొని నిలువరించడం సంగతి మాట దేవుడెరుగు ముందు వారిద్దరూ సంధిస్తున్న ప్రశ్నలకి బీజేపీ నేతలు సంజాయిషీలు చెప్పుకోవడంతోనే పుణ్యకాలం పూర్తయిపోతోంది. ఎన్నికలలో గెలిచిన తరువాత తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎన్నుకొంటామని, ఎన్నికలలో గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేయబోమని తమ ప్రత్యర్ధుల విసురుతున్న సవాళ్ళకు, ఆరోపణలకు బీజేపీ నేతలు ఇప్పుడు సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి ఏర్పడింది. బీజేపీకే విజయావకాశాలున్నట్లు అన్ని సర్వేలు స్పష్టం చేస్తునప్పుడు మరి బీజేపీ చేజేతులా ఎందుకు ఇటువంటి పరిస్థితి సృష్టించుకొంటోందో తెలియదు కానీ బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకొని చాల రిస్క్ తీసుకొంటున్నట్లు కనబడుతోంది.