ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడే పట్టు బిగించాలి. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఇదే. ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఆ పార్టీ బలహీనపడింది. తెలంగాణలో తెరాస దెబ్బకు ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య తరిగిపోతోంది. కేడర్ బేస్ కూడా తగ్గుతోంది. పైగా నేతల కుమ్ములాటలు కార్యకర్తలను అయోమయంలో పడేస్తున్నాయి. ఇదే అదునుగా తెలంగాణలో బలపడటానికి బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది.
ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. నల్గొండ జిల్లా సూర్యాపేటలో శుక్రవారం నాటి వికాస్ పర్వ్ సభే దీనికి సంకేతం. ఆ జిల్లా కాంగ్రెస్ లో గ్రూపుల కుమ్ములాటలు ముదిరాయి. కొందరు నాయకులు తెరాసలోకి జంప్ అవుతారని ఊహాగానాలు వస్తున్నాయి. నల్గొండ ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తారని జరిగిన ప్రచారం ఇప్పటి వరకైతే నిజం కాలేదు. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఆ జిల్లాలో కమలాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగమే అమిత్ షా సభ.
హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో సూర్యాపేట వెళ్లిన అమిత్ షా, తెలంగాణ అభివృద్ధే తమ పార్టీ లక్ష్యమన్నారు. అది ఏ సభలోనైనా ఏ నాయకుడైనా చెప్పేదే. తెరవెనుక చాణక్యం మాత్రం పక్కాగా సిద్ధమైందని సమాచారం. తెరాస ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో టీడీపీ, కాంగ్రెస్ లు కుదేలయ్యాయి. కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీ ఏది అనేదే ప్రశ్న. ప్రతి చోటా ప్రభుత్వం ఉన్నట్టే వ్యతిరేకత కూడా ఉంటుంది. అయితే అందులో కొన్ని హెచ్చతగ్గులు ఉండొచ్చు. ప్రభుత్వ పనితీరు నచ్చని ప్రజలు బలమైన ప్రత్యామ్నాయం వైపు చూస్తారు. ఇంత కాలం టీడీపీ లేదా కాంగ్రెస్ ఆ పాత్రను పోషించాయి. ఇకమీదట బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోంది.
హైదరాబాదులో అంతో ఇంతో బలం ఉన్న బీజేపీ, జిల్లాల వారీగా బలపడటానికి ప్లాన్ వేసింది. తెలివైన ఆర్గనైజర్ గా పేరన్న అమిత్ షా వ్యూహరచన ద్వారా తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగడం ఖాయమనేది బీజేపీ నాయకుల నమ్మకం. 2014 ఎన్నికలకు ముందు యూపీలో కేవలం ఆరేడు నెలల్లోనే అమిత్ షా అద్భుతాలు చేశారు. పార్టీని బలోపేతం చేశారు. ఎన్డీయే 73 సీట్లు గెలవడానికి ప్రధాన కారకుడయ్యారు. ఇప్పుడు తెలంగాణలోనూ బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.
గతంలోనూ అమిత్ షా ఇలాంటి సూచనలే చేశారు. కానీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. డాక్టర్ లక్ష్మణ్ కు అమిత్ షా కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే మూడేళ్లలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించడం, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటమే అమిత్ షా టార్గెట్ అంటున్నారు కమలనాథులు.