బీజేపీ పరిస్థితి ప్రస్తుత ఎన్నికల్లో అంత గొప్పగా లేదన్న అభిప్రాయం వినిపిస్తున్న సమయంలో బీజేపీలో మరో అంశం మంటలు రేపుతోంది. అదే మోదీపై ఆరెస్సెస్ కినుక వహించడం. ఆర్ఎస్ఎస్ అవసరం ఇప్పుడు లేదన్నట్లుగా బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. దీనికి బీజేపీ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమేనని జేపీ నడ్డా తేల్చారు. మాది రాజకీయ సంస్థ. ఎవరి పనులు వారికుంటాయి కదా .. బిజెపి ఇక స్వయంగా నడుస్తుంది అని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా బహిరంగంగా ప్రకటించడం సంచలనంగా మారింది.
బీజేపీ రాజకీయ పార్టీ అయినా దాని సిద్ధాంతకర్త ఆరెస్సెస్. బీజేపీ ఎదుగుదలలో ఆరెస్సెస్ పాత్ర కీలకం. కానీ నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత బిజెపి – ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్న సంబంధాలు తగ్గిపోతూ వస్తున్నాయి. తాజాగా నడ్డా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతున్నాయి. సంఘ్ పరివార్‌కు, మోడీ పరివార్ మధ్య కొంత కాలంగా ఆధిపత్య పోరు సాగుతున్నట్లు అంతర్గతంగా ప్రచారం జరుగుతూనే ఉంది. గతంలో మాదిరే తమ కన్నుసన్నల్లో బిజెపి నడవాలన్న సంఘ్ పరివార్ కోరికను మోదీ పట్టించుకోవడం లేదు. అంతా తానే అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు.
మోడీ అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరెస్సెస్ అభిమానం పొందిన సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని పక్కన పెట్టారు. అద్వానితో ప్రారంభమైన ఈ పరంపర ఇంకా కొనసాగుతోంది. తర్వాత గడ్కరీ, రాజ్ నాథ్‌లను పంపేస్తారని చెబుతున్నారు. ఎన్నికల ముందు అట్టహాసంగా నిర్వహించిన ఆయోధ్య రామమందిర ప్రారంభం కూడా సంఘ్ పరివార్‌కు, మోడీ పరివార్‌కు మధ్య వివాదాలను మరింత రాజేసిందని చెబుతున్నారు బీజేపీ గెలుపు కోసంఆరెస్సెస్ నిరంతరాయంగా పని చేస్తుంది. ఆరెస్సెస్ కు ఉన్న అనేక శాఖలు అభ్యర్థుల గెలుపు కోసం పబ్లిసిటీ లేకుండా ప్రచారం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు బీజేపీకి ఆరెస్సెస్ దూరమైతే మరింత ఇబ్బందికరమేనన్న వాదన వినిపిస్తోంది.