తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి విషయంలో సీఎం వైఎస్ జగన్ వ్యవహరిచిన తీరుపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 36 మంది సభ్యులను నియమించడంపై కోర్టుకెళ్లేందుకు సిద్ధమని… బీజేపీ ప్రకటించింది. టీటీడీని ధర్మసత్రంగా మార్చేశారని.. ఆ పార్టీ నేతలు మండి పడుతున్నారు. 36 మంది పాలక మండలి సభ్యులు… కుటుంబసభ్యులతో సహా వస్తే… ప్రమాణ స్వీకార మండపం అయిన వాహన మండపం సరిపోదని… టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీ గురంచి… జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. 36 మంది సభ్యులను నియమించడం ఎంత వరకు సమంజసమని .. టీటీడీ చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా బోర్డును నియమించారని మండిపడ్డారు.
తిరుమల శ్రీవారి ఆలయం ఏమైనా జగన్ సొంత ఆలయమా?.. ప్రజల ఆలయమా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పాలక మండలి ఉందన్నారు. తాము రాజకీయంగా ఆరోపణలు చేయడం లేదన్నారు. పాలక మండలికి సంబంధించిన మూడు జీవోలను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పాలకమండలిలో అవసరం లేకపోయినా.. అసంతృప్తులకు పునరావాసం కోసం.. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజులకే జగన్ ప్రభుత్వం విమర్శల ఎదుర్కొంటోందని.. ప్రజలు రావాలి జగన్ కాదు.. పోవాలి జగన్ అనుకుంటున్నారని భానుప్రకాష్ రెడ్డి మండిపడుతున్నారు.
నిజానికి … టీటీడీ పాలక మండలి వ్యవహారం.. చట్ట విరుద్ధంగా ఉందన్న అభిప్రాయం అధికార వర్గాల్లోనే ఉంది. బీజేపీకోర్టుకు వెళ్తామని ప్రకటించడంతో.. ఈ వివాదం కీలక మలుపులు తిరుగుతాయన్న అంచనా రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.