ఎవరండీ చెప్పారు… ఏపీ భాజపా నేతలు స్పందించరనీ..! చూడండి… ఇవాళ్ల ఎంత కలిసికట్టుగా, ఎంత బాధ్యతగా, ఏపీ ప్రజలంటే ఎంత ప్రేమగా ఢిల్లీ వెళ్లారో..! పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మురళీధరరావు, ఎమ్మెల్సీ మాధవ్, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు… వీళ్లంతా ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆ తరువాత, మీడియాతో జీవీఎల్ నర్సింహారావు మాట్లాడారు. ఎన్నికల్లో గెలవడం కోసం అన్ని రకాల తప్పుటడుగులు టీడీపీ వేస్తోందనీ, ఎన్నికల ప్రక్రియను ఖూనీ చేసేందుకు ప్రయత్నిస్తోందని వివరించామన్నారు. ఇతర పార్టీల మద్దతుదారుల ఓట్లను తొలగించే ప్రయత్నం టీడీపీ చేస్తోందనీ, ఓటర్లకు పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చేందుకు వీలుగా బ్యాంకు అకౌంట్ వివరాలను తీసుకుంటున్నారని ఆరోపించారు. డీజీపీతో సహా ఆంధ్రా పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలనీ, ఓటర్ల జాబితాను వెంటనే సవరించాలని కోరామన్నారు జీవీఎల్. పోలీస్ ఉన్నతాధికారులను రాష్ట్రానికి దూరంగా బదిలీ చేసి, ఎన్నికల సంఘం నమ్మకం ఉన్న అధికారుల సమక్షంలో ఎలక్షన్స్ జరపాలని కోరామన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సాధికార మిత్రలను వెంటనే రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నామన్నారు. డాటా చోరీకి సంబంధించి వెంటనే కేసులు నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరామని జీవీఎల్ చెప్పారు. వారు సానుకూలంగా స్పందించారన్నారు.
ఏపీ భాజపా నేతలు కొత్తగా ఈసీకి ఏం చెప్పినట్టు..? వైకాపా ఏం చెబుతోందో, తెరాస నేతలు ఏం విమర్శిస్తున్నారో అదే కదా! మొత్తానికి, ఈ డాటా చౌర్యం మీద తెరాస, వైకాపా, భాజపాలు ఏకతాటిపైకి వచ్చేసినట్టే! ఓపక్క ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించిన తరువాత… ఏపీ భాజపా నేతలు కొత్తగా ఫిర్యాదు చేయడమేంటి..? నిజానికి, ఇంత తక్షణ స్పందన ఏపీ సమస్యల విషయంలో భాజపా నేతలు ఏనాడైనా చూపించి ఉంటే ఎంత బాగుండేది! పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిధులు, ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టం అమలు… ఇలాగే స్పందించి, సంబంధిత కేంద్ర విభాగాలను కలిసే ప్రయత్నం ఏనాడైనా చేశారా..? ఈ జీవీఎల్, కన్నా, మురళీధర్ రావు, మాధవ్… వీళ్లంతా కేవలం ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీలున్న అంశాలపై మాత్రమే స్పందిస్తారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే అంశాల జోలికి వెళ్లరు! ఈ డాటా చౌర్యం కేవలం రాజకీయ పార్టీల మధ్య నలుగుబాటు అంశమనేది ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. కానీ, జరిగిన దొంగతనమేంటో, నష్టమేంటో ఎవ్వరూ చెప్పరు! అందరూ ఫిర్యాదులు చేసేవాళ్లే.