ఏపీలో బీజేపీని బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ పెద్దలు పెద్ద స్కెచ్ వేస్తున్నారు. వైసీపీ కీలక నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు గుంభనంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజమండ్రిలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై అంతర్గత చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అనేక మంది వైసీపీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని కానీ వారిలో ఎక్కువ మంది తాము చేసిన అక్రమాలకు రక్షణ కోసం వస్తున్న వారే ఉంటున్నారని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు చెప్పుకొచ్చారు అందుకే పార్టీ నేతల చేరికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. దిగువ స్థాయిలో అయినా చేరికల విషయలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.
ఏపీ బీజేపీలో నేతల చేరికలపై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లుగా గుసగుసలు ఉన్నాయి. పెద్ద నేతల్ని మూకుమ్మడిగా చేర్చుకునే ప్రక్రియను ప్రారంభించారని అంటున్నారు., వైసీపీ నుంచి వచ్చే నేతలు తమ లబ్దికి వస్తున్నా సరే.. పార్టీకి మేలు కలిగితేనే తీసుకోవాలని అనుకుంటున్నారు. షెల్టర్ కోసం వచ్చే వారు అవసరం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది రాజ్యసభ సభ్యులతో ఇప్పటికే చర్చలు పూర్తయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
రెండు మూడు నెలల్లో ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నుంచి నేతలు అటు బీజేపీలోకి.. ఇటు కాంగ్రెస్ లోకి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమలో పార్టీని బలోపేతం చేసుకునేలా బీజేపీ ఎక్కువ ప్రయారిటీతో ప్రయత్నాలు చేస్తోంది.