ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒంగోలులో జరిగింది. హఠాత్తుగా ఈ సమావేశం ఎందుకు పెట్టారా అని చాలా మంది అనుకున్నారు. ఈ సమావేశానికి నేరుగా బీఎల్ సంతోష్ వచ్చారు. దీంతో ఏదో ఉందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అది ప్రతిపక్ష పార్టీగా సహజమే. కానీ.. .చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కూడా తీర్మానం చేశారు. ఇదే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. చంద్రబాబు అరెస్టును గతంలో పురందేశ్వరి ఖండించారు. కనీసం నోటీసు ఇవ్వకుండా కూడా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
అంత వరకూ బాగానే ఉంది కానీ.. తమ పార్టీ సమావేశంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తీర్మానం చేయాల్సిన అవసరం ఏముంది ? అనేదే చర్చనీయాంశం అవుతోంది. ఏపీలోనూ టీడీపీ, జనసేనతో కలవాలని బీజేపీ అనుకుంటోందని చెబుతున్నారు. కానీ కలుపుకునేందుకు టీడీపీ ఏ మాత్రం ఆసక్తిగా లేదు. అందుకే.. అరెస్టులకు వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లుగా చెబుతున్నారు. కానీ వైసీపీతో ఉన్న సన్నిహిత సబంధాలను కట్ చేసి.. చట్టపరంగా ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే వరకూ టీడీపీ ఎలాంటి ఆలోచన చేసే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.
ఏపీ బీజేపీలో టీడీపీతో పొత్తు వద్దనుకునే ఓ బలమైన వర్గం ఉంది. వారు వైసీపీతో సన్నిహితంగా ఉంటారు. పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి చేస్తున్న అసభ్య వాఖ్యలకు వారి మద్దతు ఉందని చెబుతున్నారు. తమ పార్టీ అధ్యక్షురాలిపై అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా ఎవరూ మాట్లాడటం లేదు. కానీ హైకమాండ్ మాత్రం మెల్లగా టీడీపీ వైపు కదులుతోంది. పొత్తుల గురించి ఎన్నికల సమయంలో చెబుతామని ఇప్పుడు మాత్రం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీఎల్ సంతోష్ అంతిమంగా సందేశం ఇచ్చారు. కానీ టీడీపీ అధినేతకు అనుకూలంగా తీర్మానం చేసి పరోక్షంగా సందేశం పంపినట్లయింది.