వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కేసీఆర్ ఒక్కసారిగా టర్న్ తీసుకోవడం.. తెలంగాణ రాజకీయ పక్షాలందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన బీజేపీకి లొంగిపోయారని.. ఇతర పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ.. భారతీయ జనతా పార్టీ మాత్రం.. కేసీఆర్ ను నమ్మలేకపోతోంది. కేసీఆర్ ఏదో కుట్ర చేస్తున్నారని వారు అనుమానిస్తున్నారు. వెతగ్గా.. వెతగ్గా.. వారికి కొనుగోలు కేంద్రాల ఎత్తివేతలో కుట్ర కనబడింది. వెంటనే ప్రెస్మీట్ పెట్టిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్ తీరును విమర్శించారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను పంటల కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్ కేంద్ర చట్టాల వల్ల.. రైతులు ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకునే వెసులుబాటు ఉంది కాబట్టి.. దాన్ని అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించారు. దాంతో పాటు.. అలాచేయడం వల్ల ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చు కాబట్టి.. ఇక పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని.. గ్రామాల్లో పెట్టిన కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అసలు కేంద్ర వ్యవసాయ చట్టాలకు.. ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సంబంధంలేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయవద్దని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. అయినా సరే కేసీఆర్.. ఇదే చాన్స్ అనుకుని వాటిని కూడా ఎత్తేయాలని నిర్ణయించుకున్నారు.
పంటల కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే రైతులు ఇబ్బంది పడతారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. ప్రైవేటు వ్యాపారులదే ఇష్టారాజ్యం అవుతుంది. మద్దతు ధర సంగతి తర్వాత.. అసలు వారు చెప్పిన రేటు పెట్టి అమ్ముకోవాల్సి ఉంటుంది. ఈ భయంతోనే.. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్… ఆ చట్టాలకు మద్దతు ఇచ్చినట్లుగా ఇచ్చి.. రైతులకు సమస్యలు తెచ్చిపెట్టి.. దానికి కారణం బీజేపీనే అని చెప్పేందుకు ప్లాన్ చేస్తున్నారన్న అనుమానాలు బీజేపీలో వ్యక్తమవుతున్నాయి. అందుకే.. కేసీఆర్ ను బీజేపీ నేతలు నమ్మలేకపోతున్నారు. పంటల కొనుగోలు కేంద్రాలు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కుట్ర పూరితంగా… ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వాదిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్… తన నిర్ణయంతో బీజేపీని కూడా గందరగోళంలో పడేశారని సులువుగానే అర్థం అవుతోంది.