తెలంగాణ బీజేపీది విచిత్రమైన పరిస్థితి. ఆ పార్టీకి నిన్నటి వరకూ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో మొదటి సారి ఎన్నికైన రాజాసింగ్ నిన్నటి వరకూ బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. పీడీ యాక్ట్ పెట్టి పోలీసులు జైల్లో వేశారు. ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఇప్పటి వరకూ మూడు ఆర్లు అసెంబ్లీలో ఉన్నాయని బీజేపీ చెప్పుకుంటోంది.. కానీ ఇప్పుడు రెండు ఆర్లు మాత్రమే ఉన్నాయి. రఘునందన్, రాజేందర్. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు బీజేపీ ఎల్పీ నేత అనేది సస్పెన్స్‌గా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క గోషామహల్ నుంచే గెలిచింది. ఒకే ఎమ్మెల్యే ఉన్నారు. పోటీ లేదు కాబట్టి.. రాజాసింగే బీజేపీఎల్పీ నేత. ఆ తర్వాత రెండు ఉపఎన్నికల్లో గెలిచి రఘనందర్ రావు, ఈటల రాజేందర్ అసెంబ్లీకి వచ్చారు. వీరు తాము సీనియర్లం కాబట్టి తమకే బీజేపీఎల్పీ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. ముఖ్యంగా ఈటల రాజేందర్ తన సీరియార్టీని దృష్టిలో పెట్టుకుని ఆ పదవి ఇవ్వాలంటున్నారు. అది బండి సంజయ్‌కు ఇతరులకు ఇష్టం లేదు. అందుకే ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉనన సమయంలో బీజేపీఎల్పీ నేతను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఈ అంశంపై హైకమాండ్ ఎటూతేల్చుకోలేకపోతోంది. ఇద్దరిలో ఒకరిని బీజేపీఎల్పీ నేతను చేసి.. మరొకర్ని.. ఉపనేతను చేస్తే ఇద్దరూ ఫీలవుతారు. అందుకే ఏం చేయాలో తెలియక సైలెంట్‌గా ఉన్నారు. ఎవరినీ నియమించకపోతే..బీజేపీ శాసనసభాపక్షం తరపున నాయకుడు లేకుండా పోతాడు. ఈ చిన్న సమస్యను పరిష్కరించుకోలేకపోతున్న బీజేపీ.. ముందు ముందు ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటోందోనని ఆ పార్టీ నుంచే సెటైర్లు పడుతున్నాయి.