సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు చూస్తున్నారన్నది తెలిసిందే. దానికి అనుగుణంగా మెల్లగా పావులు కదుపుతూ ముఖ్యమంత్రుల సదస్సు ఏర్పాటు చేస్తాననీ, దేశంలో రాబోయేది ఫెడరల్ ప్రభుత్వమే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మంత్రి కేటీఆర్ కూడా అవకాశం దొరికిన ప్రతీచోటా… జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూనే ఉన్నారు. ఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ సదస్సులో ఆయన మాట్లాడుతూ… దేశంలో జాతీయ పార్టీలు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారు.
దేశంలో నిజమైన జాతీయ పార్టీలు లేవనేది తన అభిప్రాయం అన్నారు కేటీఆర్. ప్రాంతీయ పార్టీలు, వాటికంటే కాస్త పెద్ద ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఢిల్లీలో కూర్చుని చూస్తున్నవాళ్లకి కాంగ్రెస్, భాజపాలు జాతీయ పార్టీల్లా కనిపిస్తాయన్నారు. దక్షిణ భారతదేశంలో ఆరు రాష్ట్రాలున్నాయనీ, ఒక్క కర్ణాటకలో భాజపా తప్ప, ఈ రెండు పార్టీలు ఎక్కడ బలంగా ఉన్నాయంటూ ప్రశ్నించారు. ఒక పార్టీకి కొన్ని రాష్ట్రాల్లో ఉనికే లేనప్పుడు… అది నిజమైన జాతీయ పార్టీ ఎలా అవుతుందన్నారు. తొలిసారి రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు కేంద్ర ప్రభుత్వం అనే మాటే లేదనీ, గవర్నర్ మెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్ అని మాత్రమే ఉందన్నారు. రాష్ట్రాలు బలంగానే ఉంటే దేశం బలోపేతమౌతుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధి కోసమే కేంద్రం పనిచేయాలన్నారు. అంతేగానీ, సొంత అజెండాలతో రాష్ట్రాలను తొక్కిపెట్టాలని భావిస్తే అది దేశానికే ముప్పు అవుతుందన్నారు. నిజమైన అభివృద్ధి అనేది రాష్ట్రాల్లో జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని పాలసీలు తీసుకొచ్చినా, క్షేత్రస్థాయిలో ఆ పనులు జరిగేది రాష్ట్రాల్లో మాత్రమే అన్నారు. మేక్ ఇన్ ఇండియా గురించి గొప్పగా చెప్తారనీ, దీనికి సంబంధించిన పనులు కూడా రాష్ట్రాలే చెయ్యాల్సి ఉంటుందన్నారు.
ఈ సందర్భగా కేసీఆర్ విజన్ ను కూడా ప్రస్థావిస్తూ… తమ ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా సమాఖ్య స్ఫూర్తితో నడిచే ప్రభుత్వాలు వస్తాయన్నారు కేటీఆర్. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు మరింత బలపడతాయన్నారు. కేంద్రంతో తాము అంశాలవారీగా విభేదిస్తామనీ, దేశ ప్రయోజనాలకు అవసరమైన అంశాలకు మద్దతు ఇస్తామనీ, బడ్జెట్లో తెలంగాణకు భాజపా సర్కారు చేసిందేం లేదని విమర్శించారు. దక్షిణాదిలో జాతీయ పార్టీల ఉనికే లేదంటూ… ప్రాంతీయ పార్టీల కలయికకు అవకాశం ఉందనే ఒక సానుకూల దృక్పథాన్ని కేటీఆర్ బలంగా వినిపించారనే అనాలి. ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు కాబట్టి, అన్ని రాష్ట్రాలకూ ఈ అభిప్రాయం చేరుతుంది. మొత్తానికి, ఒక విజన్ ప్రకారం కేటీఆర్ మాట్లాడారని చెప్పాలి. రెండు జాతీయ పార్టీలూ ఉనికి కోల్పోతున్నాయనీ, ఫెడరల్ ఫ్రెండ్ అవసరం అనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారని అనొచ్చు.