ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని యూపియే ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో హామీ ఇచ్చిందో, దానిని అమలుచేస్తామని భాజపా సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏవిధంగా హామీ ఇచ్చిందో గానీ అదొక అంతులేని బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది. ఎన్డీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో చాలా రోజుల వరకు ఆ హామీని పునరుద్ఘాటిస్తూనే ఉంది. ఒక మంచి రోజు చూసుకొని ఆ హామీని తీసి గట్టున పెట్టేసింది. అందుకు 14వ ఆర్ధిక సంఘాన్ని అడ్డుపెట్టుకొంది. దాని పేరు చెపుతూ రాష్ట్ర ప్రజలను మానసికంగా సిద్దం చేసిన తరువాత ఇంక ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
అయితే ఈ ప్రత్యేకహోదా అంశం గురించి రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు నిలదీసినప్పుడు, గత యూపీయే ప్రభుత్వం దానిని విభజన చట్టంలో చేర్చకపోవడం వలననే ఇవ్వలేకపోతున్నామని చెపుతూ ఆ తప్పుని కాంగ్రెస్ పార్టీ మీదకు నెట్టేసేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం ఆసక్తి, చిత్తశుద్ధి లేదనే విషయం ఇప్పటికే స్పష్టం అయ్యింది. రాజ్యాసభలో అదే మళ్ళీ నిన్న మరొకమారు రుజువయింది.
విభజన చట్టంలో చేర్చకపోవడం వలననే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని మోడీ ప్రభుత్వం, భాజపా నేతలు తప్పించుకొంటున్నారు కనుక చట్టసవరణ చేసి దానిని అందులో చేర్చవలసిందిగా కోరుతూ రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కె.వి.ఫై. రామచంద్ర రావు ఒక ప్రైవేట్ బిల్లుని నిన్న రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
దానిపై జరిగిన చర్చలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్థీభాయ్ చౌదరి ప్రత్యేక హోదా అనే పేరుతో కాకపోయినా రాష్ట్రానికి అంతకంటే చాలా ఎక్కువే చేస్తున్నామని ఆ జాబితాను వివరించారు. చివరికి ఆయన మళ్ళీ మరోమారు 14వ ఆర్ధిక సంఘం పేరు చెప్పి రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వలేమని తేల్చి చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. ఒకటి: విభజన చట్టంలో ప్రత్యేకహోదా చేర్చేందుకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి సిద్దంగా ఉన్నా కూడా మోడీ ప్రభుత్వం సిద్దంగా లేదని స్పష్టం అయ్యింది. రెండవది: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ యూపీయే ప్రభుత్వం ప్రత్యేక హోదా మంజూరు చేసిన మోడీ ప్రభుత్వం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు దాని వలన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిపోతోందంటూ మొసలి కన్నీళ్లు కారుస్తూ దాని కోసం ఉద్యమాలు కూడా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ చట్ట సవరణకు స్వయంగా ప్రతిపాదన చేయకపోవడం గమనిస్తే దానికీ ఈ విషయంలో ఏమాత్రం ఆసక్తి, చితశుద్ధి లేదని స్పష్టం అవుతోంది.