తెలంగాణ రాష్ట్ర సమితిలో మారుతున్న రాజకీయంతో తమదైన మార్క్ చూపించాలని బీజేపీ, కాంగ్రెస్ తాపత్రయ పడుతున్నాయి. అయితే వీరికి పావుగా మంత్రి ఈటల రాజేందర్ మారారు. టీఆర్ఎస్లో నాయకత్వ మార్పు చర్చల్లో ఎక్కువగా ఈటల పేరు వినిపిస్తోంది. అది టీఆర్ఎస్లో మాత్రమే కాదు ఇతర పార్టీల్లో కూడా. టీఆర్ఎస్లో అయితే ఆయనకు తర్వాత కేబినెట్లో చోటు దక్కదని … పార్టీలో ఇక ప్రాధాన్యం ఉండదన్న చర్చ జరుగుతోంది. అది ఆయన దాకా వెళ్లిందేమో కానీ..ఈటల ఇటీవలి కాలంలో కాస్తంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే… విపక్ష పార్టీలు ఎందుకు ఊరుకుంటారు.. కాస్తంత మంట పెట్టాలనుకుంటాయి. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ అదే పని చేస్తున్నాయి.
టీఆర్ఎస్లో కేసీఆర్ పదవి నుంచి దిగిపోవాలనుకుంటే… ఆ పొజిషన్‌ను.. ఖచ్చితంగా ఈటలకే ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే… ఆయన ఉద్యమ కాలం నుంచి ఉన్నారని… టీఆర్ఎస్లో ఆయనకు సానుకూలత ఉంటుందని చెబుతున్నారు. అలాగని కేటీఆర్‌కు ఆయన వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కేటీఆర్ సమర్థుడనే అంటున్నారు.. కానీ వారసుడు అనే అడ్డంకి ఉంటుందని.. వారసత్వంగా పదవి ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. అందుకే.. ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌కు పదవి ఇవ్వాలని ఆయన సూచిస్తున్నారు. ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే కాదు… గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అదే మాట అన్నారు. కేసీఆర్ కు కష్టం వచ్చినప్పుడల్లా ఈటలను అడ్డం పెట్టి తప్పించుకుంటున్నారని… కేసీఆర్ సీఎం పదవి నుంచి వైదొలగాలి అని అనుకుంటే ఖచ్చితంగా పదవికి ఈటల అర్హుడనిఆయన అంటున్నారు.
బయట పార్టీల నుంచి ఈటలకు వస్తున్న సపోర్ట్.. ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఆయన వైపు టీఆర్ఎస్లోని నేతలు కూడా అనుమానాస్పదంగా చూసే పరిస్థితి వస్తోంది. పంట కొనుగోలు కేంద్రాలు ఉండవన్న కేసీఆర్ ప్రకటనపై ఇటీవల ఈటల ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ అంశంపై కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి వ్యవసాయ మంత్రి ప్రశాంత్ రెడ్డిని మీడియా కదిలిస్తే… తనకేం తెలియదని.. ఈటల ఎందుకలా మాట్లాడుతున్నారో తెలియదని.. ఆయననే అడగాలని చెప్పి తప్పించుకున్నారు. ఈటల ఉద్దేశపూర్వకంగానే అలా మాట్లాడుతున్నారని.. ఆయన చేస్తున్న రాజకీయాన్ని బీజేపీ, కాంగ్రెస్ అసరాగా చేసుకుని టీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాయని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్ టీఆర్ఎస్ను కార్నర్ చేసేందుకు ఈటలను ఉపయోగించుకోవడంతో తర్వాతేం జరుగుతుందా అన్న ఆసక్తి ప్రారంభమయింది.