తెలంగాణ కాంగ్రెస్, బీజేపీలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులను కొత్తవారిని నియమించుకోవడానికి కిందా మీదా పడుతున్నారు. పార్టీ కోసం సమయం కేటాయించలేని నేతల చేతుల్లోనే ఇంకా పార్టీలను పెట్టారు. ఫలితంగా ఆ రెండు పార్టీల కార్యక్రమాలు స్తబ్దుగా మారిపోతున్నాయి.
పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ పార్టీని గెలిపించారు. ఆయనకు సీఎం పదవి వచ్చింది. ఇక పార్టీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించి వేరే వారికి ఇస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ అది ప్రచారంగానే ఉంది. లోక్ సభ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు కూడా ఒకర్ని నియమించుకోలేకపోతున్నారు. ఎవర్ని నియమిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయోనని ఎంత లేట్ చేస్తే అంత మంచిదన్నట్లుగా ఉన్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలోనూ పీసీసీ చీఫ్ పదవి గురించి చెప్పడం లేదు. త్వరలోనే కసరత్తు చేద్దామని చెప్పి పంపినట్లుగా తెలుస్తోంది.
బీజేపీలోనూ అదే పరిస్థితి. బండి సంజయ్ ఫైర్ మీద ఉన్నప్పుడు ఆయనను తప్పించి కిషన్ రెడ్డికి చాన్సిచ్చారు. అప్పటికే ఆయన కేబినెట్ మినిస్టర్. ఇప్పుడు కూడా కేబినెట్ మినిస్టరే. కానీ కొత్త చీఫ్ ను మాత్రం నియమించలేకపోయారు. కిషన్ రెడ్డికి పార్టీని పట్టించుకునే సమయం ఉండటం లేదు. అందుకే తెలంగాణలో బీజేపీ కార్యక్రమాలు ఏమీ లేవు. ఎవరికి గుర్తొచ్చినప్పుడు వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉన్నామనిపిస్తున్నారు.
కొత్త చీఫ్ ను నియమించాలనుకుంటున్నా.. వర్గ పోరాటం భారీగా ఉంది. దీంతో హకమాండ్ ఆలోచిస్తోంది. ఈటలకు ఇవ్వాలని ఉన్నా.. సీనియర్లు ఎలా స్పందిస్తారోననేది బీజేపీ హైకమాండ్ ఆందోళన. మొత్తంగా రెండు పార్టీలు… తమ పార్టీని నడిపించే వారిని ఎంపిక చేసుకోవడానికి కిందా మీదా పడుతున్నాయని అనుకోవచ్చు.