తమిళనాడు రాష్ట్రంలో అధికార అన్నాడిఎంకె పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొందామని భంగపడిన భాజపా, ఆ తరువాత, సినీ నటుడు విజయ్ కాంత్ నేతృత్వంలోని డిఎండిఎంకె పార్టీతోనయినా పొత్తులు పెట్టుకొందామని ప్రయత్నించి మళ్ళీ భంగపడి చివరికి ఆ రాష్ట్రంలో ఏకాకిగా మిగిలిపోయింది. తమిళనాడులో పరిస్థితి ఇలాగ ఉంటే, కేరళలో మరొక రకమయిన పరిస్థితి నెలకొని ఉండటం వలన అక్కడ కూడా ఎకాకీగానే మిగిలిపోయింది. కేరళ రాష్ట్రంలో గత మూడున్నర దశాబ్దాలుగా రెండే రెండు కూటములు అధికారం దక్కించుకొంటున్నాయి. కనుక ఆ రాష్ట్రంలో మూడో పార్టీకి, కూటమికి ప్రవేశమే దొరకడం లేదు. వాటిలో ఒక కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుంటే, మరొకదానికి వామ పక్షాలు నేతృత్వం వహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భాజపా కేరళలో పోటీ చేయవలసి రావడం ఏటికి ఎదురీదడమేనని చెప్పకతప్పదు. అక్కడి ప్రజలపై ప్రధాని నరేంద్ర మోడి ప్రభావం కనబడదు. కనుక స్వయంగా నరేంద్ర మోడీయే తెల్ల పంచె కట్టుకొని వచ్చి ప్రచారం చేసినా ఎవరూ పట్టించుకోరు కనుక భాజపాని పట్టించుకొనేవాళ్ళు తక్కువే. పైగా ఉత్తరాదికి చెందిన భాజపాకి కేరళ, తమిళనాడు రెండు రాష్ట్రాలలో కూడా అక్కడి బాష, సంస్కృతి పెద్ద అడ్డుగోడలుగా నిలుస్తాయి. దుర్భేధ్యమయిన ఆ బలమయిన గోడని చేదించి, అక్కడి ప్రజలతో భాజపా మమేకం కావడం అసాధ్యం. కనుక ఎన్నికలలో క్రికెటర్ శ్రీ శాంత్ వంటి స్థానిక అభ్యర్ధులనే నిలబెట్టినా, భాజపా మన పార్టీయే అన్న భావన ప్రజలలో కలిగించడం కష్టం. ఈ కారణంగా ఆ రెండు రాష్ట్రాలలో గెలిచే అవకాశాలు బొత్తిగా లేవని తెలిసి ఉన్నప్పటికీ కానీ జాతీయ పార్టీ అయిన పాపానికి పోటీ చేయక తప్పడం లేదు. కేరళలో ఉన్న మొత్తం 140 స్థానాలలో భాజపా 93 స్థానాలకు పోటీ చేస్తోంది. మిగిలిన 37 స్థానాలను అంతగా ఎవరికీ పరిచయం లేని ప్రాంతీయ పార్టీ భారత ధర్మ జనసేన పార్టీకి కేటాయించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. రాజశేఖరన్ మీడియాకి తెలిపారు. భాజపా ఒకప్పుడు దక్షిణాదిన కర్నాటక రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు అధికారం నిలుపుకొంది కానీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప, అక్రమ గనుల త్రవకాల స్పెషలిస్ట్ గాలి జనార్ధన్ రెడ్డి వంటి వారి పుణ్యమాని అధికారం కోల్పోయింది. ఆంధ్రాలో తెదేపాతో జత కట్టి ఉనికిని కాపాడుకోగలుగుతోంది. కానీ హామీలు అమలు చేయనందుకు ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటోంది. తెలంగాణాలో మొన్నటి వరకు కొంచెం బలంగానే ఉండేది కానీ ఇప్పుడు తెరాస ధాటికి ఎదురునిలవలేక విలవిలలాడుతోంది. ఊరుగాని ఊరు, బాష గాని బాష అన్నట్లుండే కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో అడుగుపెట్టే అవకాశమే కనబడటం లేదు. ఈ పరిస్థితులలో భాజపా ఉత్తరాదికే పరిమితమవవలసి రావచ్చును.