ఎపికి బిజెపి చూపిస్తున్న ఫెయిల్యూర్ సినిమా
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదని ఇప్పటికే స్పష్టమైపోయింది. ఎపికి ఇచ్చిన హామీలు గాలిమాటలేనని ప్రజలకు అర్ధమైపోయేలా ప్రవర్తిస్తూ వస్తున్న బిజెపి విభజన చట్టంలో ఆర్ధిక అంశాలను కూడా అమలు చేయబోవడం లేదన్న సంకేతాలు ఇవ్వడం మొదలు పెట్టింది. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వవలసిన వేలకోట్ల రూపాయలకు గాను ఏడాదికి వందేసి కోట్లు విదిలిస్తోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ఆమాత్రం కూడా లేకపోవడమే అందుకు ఒక ఉదాహరణ!
భీమవరంలో ముగిసిన రెండురోజుల బిజెపి రాష్ట్రకార్యవర్గ సమావేశాల్లో కూడా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధిగా వచ్చిన ఎంపి, రాష్ట్ర ఇన్ చార్జ్ సిద్దార్ధనాధ్ సింగ్ చట్టప్రకారం ఎపి కి ఇవ్వవలసిన సాయాల ప్రస్తావన చేయలేదని తెలిసింది. ఆయన ముగింపు ఉపన్యాసంలో రాష్ట్రానికి ఇప్పటికే రూ. లక్షా 43 వేల కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేసి రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం సహాయం చేస్తోందని తెలిపారు. యుపిఎ హయాంలో 13వ ఆర్ధిక సంఘం ద్వారా రూ.98,820 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్ధిక సహాయంగా రాగా ఎన్‌డిఎ హయాంలో 14వ ఆర్ధిక సంఘం ద్వారా 2015-2020 వరకు రూ.2,06,910 కోట్లు ఆర్ధిక సహాయంగా అందనున్నాయన్నారు. యుపిఎ కన్నా 1,1,19,000 కోట్లు అదనంగా విభజిత ఆంధ్రప్రదేశ్‌కు నిధులు అందనున్నాయన్నారు.
ఈ అంకెలు ఘనంగానే వున్నాయి. అయితే ఇది ఏకపక్ష విభజన వల్ల నష్టపోయిన ఎపికి చట్ట ప్రకారం హక్కుగా వస్తున్న సహాయం కాదు…అలాగే బిజెపి / ఎన్ డి ఎ ప్రభుత్వం దయాధర్మంగా వేస్తున్న భిక్ష కూడాకాదు. దేశ ఆదాయాల్లో రాష్ట్రాలకు పంచుతున్న రొటీన్ వాటా మాత్రమే! యుపిఎ ప్రభుత్వం హయాంలో 13 వ ఆర్ధిక సంఘం కేటాయుంపుల తర్వాత 14 వ సంఘం నాటికి ఆదాయాలు పెరిగాయి. కేటాయింపుల స్ట్రక్చర్ మారింది. ఆప్రకారం అన్ని రాష్ట్రాల వాటాలు పెరిగాయి. ఇది దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ఉద్దరించడం కాదు.
13 వ ఆర్ధిక సంఘం కేటాయింపులను 14 వ ఆర్ధిక సంఘం కేటాయింపులను రాష్ట్రాల వారీగా వెల్లడిస్తే ఆంధ్రప్రదేశ్ కు బిజెపి చెబుతున్న మాటల్లో మాయ మాయమైపోతుంది.
అయితే, కేంద్రమంత్రిగా విచక్షణాధికారాలతో, పలుకుబడితో బిజెపి మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు పలు పధకాల్లో ఇతరరాష్ట్రాల కంటే కోటాలు పెంచి ఆంధ్రప్రదేశ్ కు ఎంతగానో సాయపడ్డారు.
ఇలా వుండగా ఏరాష్ట్రానికీ అందనంత సహాయాన్ని ఎపికి బిజెపియే అందించిందని గ్రాస్ రూట్ లెవెల్లో అంటే పార్టీ బూత్ కమిటీల స్ధాని నుంచీ ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని సిద్దార్ధనాధ్ సింగ్ పిలుపు ఇచ్చారు. ఇందుకు ముందుగా బిజెపి రాష్ట్రశాఖ ఇపుడు బూత్ కమిటీలను నిర్మించకోవలసి వుంది.