విజయసాయి రెడ్డి కి బిజెపి కి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా బిజెపి ప్రకటించడాన్ని ఎద్దేవా చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తే, బిజెపి ఆ ట్వీట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ బిజెపి జనసేన కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దాన్ని ఎద్దేవా చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ, “జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక. కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కట్ వేయడం కాక మరేమిటి? ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికి లేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట!” అని రాసుకొచ్చారు.
అయితే దీనికి దీటైన సమాధానం ఇచ్చింది బిజెపి ఆంధ్ర ప్రదేశ్. బిజెపి ఆంధ్రప్రదేశ్ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కు సమాధానం ఇస్తూ,” మా పార్టీపై మీరు చేసే వ్యాఖ్యలు, మేము మీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నామని తెలియ చేస్తున్నాయి. మీ అహంకారపు మాటల్ని నేలకూల్చే రోజు దగ్గర్లోనే ఉంది. ఆరోజు లోపలికి క్యాబేజీలతో పాటు బిస్కెట్లు కూడా పంపిస్తాం. తప్పుడు మాటలు మాని అప్పులెట్టా తేవాలో చూడండి సాయి అన్నా!”అని రాసుకొచ్చింది.
విజయసాయిరెడ్డి మొన్నటి ట్వీట్ లో సోము వీర్రాజు ప్రజల చెవిలో క్యాబేజీ పెడుతున్నాడు అని చెప్పగా, బీజేపీ నేతలు – విజయసాయిరెడ్డి జైల్లో ఏడాదిపాటు గడపడం వల్ల , అక్కడ చాలా తరచుగా క్యాబేజీ పెట్టడం వల్ల, బయటకు వచ్చిన తర్వాత కూడా తన ట్విట్టర్ ద్వారా తరచుగా క్యాబేజీని తలుచుకుంటున్నాడు అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తూ, ఈసారి మళ్ళీ జైలుకు వెళ్ళేటప్పుడు క్యాబేజీ తో పాటు మీకు బిస్కెట్లు కూడా పంపిస్తాము అంటూ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.