దక్షిణాదిలో పట్టులేని బీజేపీ గవర్నర్లతో రాజకీయం చేస్తూ రాజకీయ అలజడి రేపుతోంది. కర్ణాటకలో సొంత ప్రభుత్వం.. ఏపీలో సామంత ప్రభుత్వం ఉండటంతో ఆ రెండు రాష్ట్రాల్లో మాత్రం.. వివాదాస్పద బిల్లులను సైతం గవర్నర్లు ఆమోదిస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే బిల్లులపై ఏపీ గవర్నర్ సంతకం పెట్టేస్తున్నారు. కోర్టులు తప్పు పట్టినా ఆయన పట్టించుకోవడం లేదు. కర్ణాటకలో రిజర్వేషన్ల బిల్లును కూడా అక్కడి గవర్నర్ ఆమోదించేశారు. కానీ కేరళ, తమిళనాడు, తెలంగాణ గవర్నర్లు మాత్రం.. రాజ్యాంగేతరశక్తులుగా మారిపోయారు.
తమిళనాడు గవర్నర్ డిఎంకె ప్రభుత్వంతో ఢీ కొడుతున్నారు. ప్రతీ దానికి అడ్డం పడే ప్రయత్నాన్ని అక్కడి గవర్నర్ రవి చేస్తున్నారు . దీంతో ఇప్పుడు గవర్నర్ వర్సెస్ సిఎం మధ్య నిప్పు రాజేసుకుంది. అసలు మాకు ఈ గవర్నర్ వద్దని తమిళనాడు సిఎం స్టాలిన్ ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదు. వెనక్కి పంపిస్తున్నారు. కేరళ గవర్నర్ ఇంకా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మంత్రుల్ని తీసేయమని ఆదేశాలిస్తున్నారు. చాన్సలర్ అనే హోదా ఉందని రెచ్చిపోతున్నారు. దీంతో ఆయనను చాన్సలర్‌గా తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది.
ఇక తెలంగాణ సంగతి చెప్పాల్సిన పని లేదు. కళ్ల ముందే కనిపిస్తోంది. తమిళిసై కూడా ఏడు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. వివరణ కావాలని అడుగుతున్నారు. అటు వెనక్కి పంపడం లేదు.. ఇటు ఆమోదించడం లేదు. దీంతో టీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. బీజేపీయేతర ప్రభుత్వాలు ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్న ఢిల్లీ, బెంగాల్, బీహార్, పంజాబ్ వంటి చోట్ల కూడా గవర్నర్ దూకుడు చూపిస్తున్నారు. అధికారం లేని చోట గవర్నర్లతో బీజేపీ ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతోందన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.