భారతీయ జనతాపార్టీ నాయకుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజమండ్రిలో సంచలనవ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యరావుని తెదేపా ప్రభుత్వం పక్కనబెట్టి పుష్కరాలను నిర్వహిస్తోందని ఆరోపించారు. దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న ఆయన నేతృత్వంలో పుష్కర పనులు జరుపవలసి ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు కూడా ఆయనని పక్కనబెట్టి పుష్కర పనులు నిర్వహించడాన్ని కన్నా లక్ష్మీనారాయణ తప్పు పట్టారు. తెదేపా ప్రభుత్వ ప్రచారార్భాటమే తప్ప పుష్కర పనులలో ఏమాత్రం నాణ్యత కనబడటం లేదని విమర్శించారు. తనను పక్కనబెట్టడాన్ని మంత్రి మాణిక్యాల రావు కూడా ఇటీవల జరిగిన మంత్రుల సమావేశంలో ప్రశ్నించినట్లు సమాచారం. అయితే తెదేపా ప్రభుత్వం బీజేపీ నేతలను మొదటి నుండే పట్టించుకోవడం లేదనే స్పృహ ఇన్నాళ్ళ తరువాత వారికి కలిగిందో లేక మిత్రపక్షం కనుక విమర్శించడం సబబు కాదని వెనక్కి తగ్గారో కానీ ఇంతవరకు బీజేపీ నేతలు ఎన్నడూ కూడా తెదేపా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేదు. కానీ ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించేసరికి మంత్రులు అందరూ ఉలిక్కిపడి వెంటనే ఎదురుదాడి కూడా ప్రారంభించేసారు. మాణిక్యాలరావుని పక్కనబెట్టామన్న కన్నా విమర్శలను ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో తామందరం కలిసి పనిచేస్తున్నామని అన్నారు. మరొక తెదేపా నేత మాట్లాడుతూ “కన్నా గుంటూరులో కూర్చొని పుష్కర పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించడం కంటే స్వయంగా రాజమండ్రి వచ్చి చూసిన తరువాత పనుల నాణ్యత గురించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు.
పుష్కర పనుల నాణ్యత విషయంలో కన్నా చేసిన విమర్శల కంటే ఆయన మంత్రి మాణిక్యరావు విషయంలో చేసిన విమర్శలు చాలా సహేతుకంగానే ఉన్నాయని చెప్పవచ్చును. నిజానికి ఈ పుష్కర కార్యక్రమాలన్నీ దేవాదాయ శాఖ మంత్రి అద్వర్యంలో నిర్వహించి ఉండాలి. తెలంగాణాలో పుష్కరపనులను ఆయా శాఖల మంత్రులే స్వయంగా పర్యవేక్షిస్తుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ వాటి పురోగతిని సమీక్షిస్తున్నారు. కానీ ఆంధ్రాలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిగిలిన అన్ని పనులను పక్కనబెట్టి తనే స్వయంగా పుష్కర పనులు చూసుకొంటున్నారు. ఆయన ప్రచారార్భాటం కోసం తాపత్రయపడటం ఇదేమీ మొదటిసారి కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ కూడా అదే మాటన్నారు. రాష్ట్రంలో తెదేపాకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించాలనుకొంటున్న బీజేపీని తెదేపా ప్రభుత్వం పక్కనబెడితే, బీజేపీ ఎల్లకాలం మౌనం వహించి చూస్తూ ఊరుకోదని కన్నా వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. కనుక ఇకనయినా బీజేపీ నేతలకి, మంత్రులకి తగు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెదేపా గ్రహిస్తే దానికే మంచిది.