తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో..ఆ తరువాత కొన్ని నెలలపాటు ఎటువంటి క్లిష్ట పరిస్థితులని ఎదుర్కొందో, రెండేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు సరిగ్గా అటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటుండంటం చాలా విచిత్రంగా ఉంది. మొదట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీచులాటలు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు, వాటితో మొట్టి కాయలతో కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆ తరువాత రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సంక్షోభంతో మరికొంత కాలం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. ఆ తరువాత చండీయాగం మహిమో ఏమో గానీ సుమారు ఏడాదిన్నర పాటు తెరాసకి, ప్రభుత్వానికి తిరుగులేకుండా జరిగింది. పోటీ చేసిన ప్రతీ ఎన్నికలలో గెలుస్తూ, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నిటినీ నిర్వీర్యం చేస్తూ, చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఒకటొకటిగా విజయవంతం అవుతుంటే, తెరాస ప్రభుత్వం పేరుప్రతిష్టలు పెరిగాయి. అదే సమయంలో ఓటుకి నోటు కేసుతో తెలంగాణాలో తెరాసకి సవాలు విసురుతున్న తెదేపాని కూడా దెబ్బ తీయడంతో తెరాసలో ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగింది.
తెలంగాణాలో ఇక తెరాసకి తిరుగే లేదు..రాష్ట్రంలో దానిని ప్రశ్నించేవారే లేరు అనుకొంటున్న సమయంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారంతో నీరసపడిపోయిన ప్రతిపక్ష పార్టీలన్నిటికీ ఊపిరి ఊది తిరిగి ప్రాణం పోసినట్లయింది. ఆవన్నీ కలిసి ఇప్పుడు తెరాస ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తూ ముప్పతిప్పలు పెడుతూ ప్రతీకారం తీర్చుకొంటున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే, తెలంగాణా యూనివర్సిటీలకి వైస్ ఛాన్సిలర్స్ నియామకాల కోసం తెరాస ప్రభుత్వం ఇచ్చిన జీ.ఓ.ని హైకోర్టు రద్దు చేసి మళ్ళీ మొట్టికాయాలు వేసింది. దానితో తెరాస ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్ష పార్టీలకి మళ్ళీ మరో అవకాశం కలిగింది. అది స్వయంకృతాపరాధమే కనుక అందుకు ప్రతిపక్ష పార్టీలకి తిరిగి జవాబు చెప్పలేని దుస్థితి ఏర్పడింది.
న్యాయస్థానాలలో తెరాస ప్రభుత్వానికి పదేపదే ఎదురుదెబ్బలు తింటుండటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. న్యాయపరమైన అంశాలని, నిబంధనలని, విధివిధానాలని పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకొంటున్న కారణంగానే న్యాయస్థానాలలో ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు కనబడుతోంది. తెరాస ప్రభుత్వానికి న్యాయనిపుణులు అందుబాటులోనే ఉన్నప్పటికీ తరచూ ఈవిధంగా ఎందుకు జరుగుతోందో, లోపం ఎక్కడ ఉందో తెలుసుకొని దానిని సరిచేసుకొంటే బాగుంటుంది కదా.
రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్, అదే విషయం ప్రస్తావిస్తూ తెరాస ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెరాస అధికారంలోకి వచ్చి రెండేళ్ళే అయినా, రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నిటినీ నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నిరంకుశ పద్దతిలో పాలన చేస్తున్న కెసిఆర్, నిబంధనలని, విదివిధానాలని ఏమాత్రం పట్టించుకోకుండా తనకి నచ్చినట్లు జీ.ఓ.లు జారీ చేస్తూ కోర్టుల చేత పదేపదే మొట్టికాయలు వేయించుకొంటున్నారని, అయినా కెసిఆర్ తీరులో మార్పు రావడం లేదని విమర్శించారు. విసిల నియామకం విషయంలో హైకోర్టు తీర్పు తెరాస ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిదేనని అన్నారు. కెసిఆర్ నిర్ణయాలని కోర్టులు కూడా తప్పు పడుతున్నాయంటే, ఆయన పాలన, పద్దతి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.
ఒకప్పుడు ఆంధ్రా పాలకులని కెసిఆర్ తప్పు పడితే ఇప్పుడు ఆయననే ప్రతిపక్ష పార్టీలు తప్పు పడుతున్నాయి. కేవలం రెండేళ్ళ వ్యవధిలోనే తెలంగాణాలో మళ్ళీ ఇదివరకటి రాజకీయ వాతావరణం ఏర్పడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.