తెలుగుదేశం పార్టీ మళ్లీ నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధమైందని ఢిల్లీలో రాజకీయవర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. బీజేపీ అనుకూల మీడియా ఇదే ప్రచారాన్ని చేస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ పొత్తు ఉంటుందని చెబుతున్నారు. నిజానికి తెలంగాణలో పొత్తుల జోలికి వెళ్లరని అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సారి కూడా అదే చేస్తారన్న అనుమానాలు కొంత మందిలో ఉన్నాయి. అందుకే తెలంగాణ నేతలు పొత్తులు వద్దనుకుంటున్నారు.
ఎన్డీఏలో పార్టీలేమీ లేవు.. టీడీపీ వస్తే కాస్త కూటమి రూపం !
ఎన్డీఏలో ప్రస్తుతం బీజేపీ తప్ప గుర్తింపు ఉన్న పార్టీలేమీ లేవు. నిన్నామొన్నటిదాకా అకాలీదళ్, శివసేన, అన్నాడీఎంకే, లోక్ జనశక్తి , జేడీయూ లాంటివి ఉండేవి. ఇప్పుడేమీ లేవు. ఇప్పుడున్నపారటీలు బలం ఉన్నవి కావు. ప్రస్తతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఉన్న పార్టీ ఏది అంటే.. శివసేన చీలిక గ్రూపు మాత్రమే. వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏలో కొత్త పార్టీలను చేర్చుకోవాలని మోదీ, షా భావిస్తున్నారు. ఆ ప్రకారమే.. టీడీపీని ఆహ్వానించాలని అనుకుంటున్నారు.
వైసీపీ వాడుకుంటుంది.. టీడీపీని వాడుకోవచ్చు !
వైసీపీ అయితే బీజేపీని వాడుకుంటుంది. నిర్ణయాలకు మద్దతిచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై ఒత్తిడి తెస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ జరిగింది అదే. అలా అని జగన్ను బీజేపీ నమ్మలేదు. అధికారికంగా ఎన్డీఏలో చేరదు. అలా చేరితే వైసీపీ ఓటు బ్యాంక్లు గల్లంతవుతాయి. ఎన్డీఏలో చేరం కానీ ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తామని చెబుతారు. కానీ వచ్చే ఎన్నికల తర్వాత నిజంగా వైసీపీకే ప్రభుత్వాన్ని నిలబెట్టేంత బలం ఉంటే తమ వెంటే ఉంటుందన్న నమ్మకం బీజేపీ నేతలకే ఉండదు. ఇప్పటికే పలుమార్లు.. బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోతే.. తామేంటో చూపించే వాళ్లమని చెప్పారు కూడా. అదే టీడీపీని అయితే బీజేపీ వాడుకోవచ్చు. వారి ఓటు బ్యాంక్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.
కూటమి గట్టిగా ఉంచే నాయకుడు ఉండాలి !
బీజేపీకి రెండు సార్లు సొంత మెజార్టీ అద్భుతం వల్ల వచ్చింది. హిందీ రాష్ట్రాలు.. గుజరాత్ వంటి చోట్ల ఒకటి రెండు మినహా అన్నీ గెల్చుకోవడంతోనే విజయం వచ్చింది. ఈ సారి అలాంటి పరిస్థితి ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఓ ఇరవై శాతం సీట్లు కోత పడినా అది బీజేపీకి ఇబ్బందికరంగా మారుతుంది. మెజార్టీని లోటులోకి తీసుకెళ్తుతంది. అందుకే ఈ సారి దక్షిణాదిలో సీట్లు పెంచుకోవాలని అనుకుంటోంది. నేరుగా గెలుచుకోలేని చోట.. కూటమి కట్టి గెలవాలనుకుంటోంది. అందుకే.. అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాత టీడీపీ బెటర్ ఆప్షన్ అని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూటముల్ని సిద్ధం చేయడంలో సిద్ధహస్తుడు. గతంలో వాజ్ పేయి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీలన్నింటినీ కూడగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే చంద్రబాబు వైపు బీజేపీ మొగ్గుచూపుతున్నట్లుగా కనిపిస్తోంది.