విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా కోర్ కమిటీ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. దానిలో పాల్గొనడానికి డిల్లీ నుంచి వచ్చిన ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఇక్కడి రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. దానిని విభజన చట్టంలో చేర్చనందున, 14వ ఆర్ధిక సంఘం ఆమోదం పొందనందున, ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాము. అయితే ఏపిని మా పార్టీ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించింది. అందుకే ఏపికి దేశంలో మరే రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు మంజూరు చేసాము. ఇంకా చేస్తాము కూడా.”
“ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఇంతవరకు వివిధ ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.1,70,686 కోట్లు ఇచ్చేము. రెవెన్యూ లోటు భర్తీకి రూ. 22,112 కోట్లు ఇవ్వవలసి ఉండగా ఇప్పటికే రూ. 7,020 కోట్లు విడుదల చేసాము.”
“ఏపిని మా ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి దాని అవసరాలకు తగ్గట్లుగా నిధులు మంజూరు చేయాలని భావిస్తున్నప్పుడు, ప్రత్యేక హోదా పేరుతో ఏపికి 2,3…11,12,13 అంటూ ఏదో ఒక నెంబరు కేటాయించడం మాకు ఇష్టం లేదు. అది సరికాదు. రాష్ట్రాభివృద్ధికి మా ప్రభుత్వం అన్ని విధాలా ఏపి ప్రభుత్వానికి సహకరిస్తుంది. పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. రైల్వే జోన్ ఏర్పాటు విషయం కేంద్రం పరిశీలిస్తోంది. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేదేమీటంటే ప్రత్యేక హోదా అనే పేరు పెట్టి మేము సహాయం చేయలేము కానీ ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రంగా గుర్తించి అంతకంటే చాలా ఎక్కువే సహాయం చేస్తామని హామీ ఇస్తున్నాను.”
“దీనిపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ మైలేజి పొందాలని ప్రయత్నిస్తున్నాయి. వాటిని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే మాకు చాలా గౌరవం. ఆయనను నేను కలుస్తాను. రాష్ట్రంలో భాజపాని బలోపేతం చేసుకోవడం అంటే మిత్రపక్షాన్ని సవాలు చేయడం కాదని మా అభిప్రాయం. కనుక మండల స్థాయి వరకు మా పార్టీని విస్తరింపజేసుకొనేందుకు జూన్ నెలాఖరులోగా కమిటీలను ఏర్పాటు చేసుకొంటాము. జూన్-జూలై నెల మద్యలో జరిగే పార్టీ సమావేశానికి మా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా వస్తారు,” అని సిద్దార్థ్ నాథ్ సింగ్ చెప్పారు.