కరోనా బాధితులకు ప్రభుత్వ సాయాన్ని వైసీపీ నేతలు పంపిణీ చేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఫైరయ్యారు. ఆయన నేరుగా…ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేసేశారు. పేదలకు ఇచ్చిన వెయ్యి రూపాయల సాయాన్ని.. వైసీపీ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారని .. డబ్బును వైసీపీ పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని లేఖలో కన్నా తెలిపారు. ఏపీ సర్కార్ కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం వైసీపీ అభ్యర్థులపై అనర్హత వేటు, జైలు శిక్ష విధించాలని కన్నా లేఖలో కోరారు. వైసీపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలా.. తిరుగుతూ..సాయం పంపిణీ చేస్తున్న విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టకూడదని కన్నా నిర్ణయించుకోవడం వెంటనే.. వైసీపీ తన నేతల్ని రంగంలోకి దిగింది.
అంబటి రాంబాబు.. వెంటనే తెరపైకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయానికి సీఎం జగన్ స్టాంప్ వేసుకుని పంచుతున్నారంటూ కన్నా లక్ష్మినారాయణ చేసిన ఆరోపణల్ని ఖండించారు. ఆ నిధులు ప్రధాని మోదీ, జగన్‌వి కాదని.. ప్రజలవేనని చెప్పుకొచ్చారు. కరోనాపై సాయాన్ని వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్దికి ఉపయోగించుకుంటూండటం..తీవ్ర విమర్శల పాలవుతోంది. రేషన్ బియ్యాన్ని ఇంటింటికి సరఫరా చేయడానికి ఎన్నో సాకులు చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. పెన్షన్లు..రూ. వెయ్యి సాయాన్ని మాత్రం..నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు.
అదీ కూడా స్థానిక ఎన్నికల్లో నిలబడిన ఇప్పిస్తున్నారు. ఫోటోలు కూడా దిగుతున్నారు. ప్రస్తుతం కోడ్ అమల్లో లేదు. అయినప్పటికీ.. నామినేషన్లు వేసిన తర్వాత.. ఏ అధికారిక హోదా లేకుండా ఇలా డబ్బులు పంచడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. దీన్ని కరోనా హడావుడి తగ్గిన తర్వాత మరింత ఎక్స్పోజ్ చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. స్థానిక ఎన్నికల విషయంలో వైసీపీ తీరును బీజేపీ మొదటి నుంచి ఖండిస్తోంది.