ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఉంచేలా కేంద్రం ద్వారా ఏపీ సర్కార్‌పై ఒత్తిడి చేసి.. ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో జమ చేసుకునే ప్లాన్‌ను బీజేపీ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అమరావతి కోసం.. పెద్ద ఎత్తున పాదయాత్రకు ఏపీ బీజేపీ సిద్ధమయింది. గుంటూరు నుంచి విజయవాడ వరకు.. రాజధాని గ్రామాల మీదుగా.. ఏపీ బీజేపీలోని అన్ని ప్రాంతాల నేతలూ కలిసి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజుల పాటు ఈ పాదయాత్ర చేయాలని.. దాని ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలని.. తమ పోరాటాన్ని ప్రజల దృష్టిలో పడేలా చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ… అమరావతి విషయంలో ఓ స్పష్టమైన తీర్మానాన్ని చేసింది.
గతంలో రాయలసీమ డిక్లరేషన్లు చేసి… ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం అమరావతికే కట్టుబడి ఉన్నట్లుగా.. స్పష్టం చేసింది. ఈ మేరకు తీర్మానం చేసింది. దాన్ని కేంద్ర పార్టీకి పంపింది. జేపీ నడ్డా కూడా.. ఎవరు ఏం మాట్లాడినా… రాష్ట్ర పార్టీ తీర్మానమే అంతిమం అని తేల్చేశారు. అంటే బీజేపీ అధికారిక విధానం అమరావతి కొనసాగింపు మాత్రమే. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా.. పర్మిషన్ లేకుండా… ఏ రాష్ట్రంలోనూ.. అటు పుల్ల ఇటు కదలడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది.
ముఖ్యంగా.. సీబీఐ కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అయితే.. కేంద్రమే సుప్రీం. మోడీ, షాలు వద్దు అంటే.. ఒక్క అడుగు కూడా ముందుకేసే పరిస్థితి ఉండదు. బీజేపీ.. తమ పోరాటాన్ని పీక్స్ తీసుకెళ్లిన తర్వాత.. కేంద్రం ద్వారా.. జగన్ ప్రయత్నాల్ని అడ్డుకుని.. ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో జమ చేసుకునే ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. పాదయాత్రలతో దీనికి శ్రీకారం చుట్టబోతున్నారని చెబుతున్నారు.