కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న.. అతి విశ్వాసమో.. ఆత్మవిశ్వాసమో కానీ.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు… తాము లేస్తే మనుషులం కాదన్నట్లు వ్యవహరించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలంతా కలిసి.. గవర్నర్ నరసింహన్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లనున్నారు. ఏపీ లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పిందనేది వీరి వాదన. అంతగా ఏపీలో ఏం జరిగిందనే అనుమానం సహజంగా.. రాష్ట్రపతి పాలన ప్రస్తావన విన్నవారికి వస్తుంది. దానికి బీజేపీ నేతలు చెబుతున్న కారణం…తమపై దాడులు జరుగుతూండటమట.
కొద్ది రోజుల క్రితం.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు అనంతపురం జిల్లాకు వెళ్లారు. అక్కడ కొంత మంది తెలుగు యువత కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలు రివర్స్ లో .. వారిపై దాడులకు దిగారు. దాంతో రచ్చ రచ్చ అయింది. కాసేపటికే సద్దుమణిగిపోయింది. ఇదే ఇప్పుడు బీజేపీ నేతలకు రాష్ట్రపతి పాలన విధించాల్సినంతగా లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని… చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఘటన. ఈ మాత్రం దానికే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ దగ్గరకు వెళ్లడం అంటే.. కేంద్రంలో ఉన్న మా ప్రభుత్వమే..మేం ఏమైనా చేయగలమని బెదిరించడమే కదా..!.
ఈ బెదిరింపుల విషయంలో మాత్రం బీజేపీ నేతలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా ఇలాంటి దాడుల విషయంలో బీజేపీపైనే రివర్స్ ఆరోపణలు వస్తున్నాయి. కొన్నాళ్ల కిందట తిరుమలకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు నిరసన సెగ తగిలిదింది. ఏం జరిగిందో కానీ… కాన్వాయ్ లోని ఓ కారు అద్దం పగిలిపోయింది. టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఒకటే గగ్గోలు రేగింది. అసలు విషయం ఏమిటంటే.. అమిత్ షా కాన్వాయ్ లో ఉన్న కోలా ఆనంద్ అనే బీజేపీ నేత… నిరసన కారులపై దాడులకు దిగారు. దానికి వచ్చిన రియాక్షన్ అది. వీడియో దృశ్యాలతో సహా బయటపడటంతో ఆయనపై కేసు కూడా నమోదైంది.
అనంతపురం ఘటనలో కూడా.. బీజేపీ కార్యకర్తలు దాడి చేశారంటూ.. టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. బీజేపీనే.. ఇలాంటి ఆందోళన విషయంలో.. కాస్తంత రఫ్ గా వ్యవహరించి.. వివాదం సృష్టించి శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఏపీ బీజేపీ నేతలు మాత్రం… కాస్త అతిగా ఆలోచిస్తున్నారన్నది మాత్రం నిజం అంటున్నారు జనం.