బీజేపీని ఇప్పుడు ఓ డైరీ వణికిస్తోంది. యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ఉన్నప్పుడు 2009లో బీజేపీ అధిష్టానానికి, కేంద్ర కమిటీ సభ్యులకు, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు డబ్బుల మూటలు పంపారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రూ. 18 వందల కోట్ల రూపాయల మేర ముడుపులు పంపారని కాంగ్రెస్ అంటోంది. యడ్యూరప్ప తరపున బీజేపీ కేంద్ర కమిటీకి రూ. వెయ్యి కోట్లు అందాయని, అందులో జైట్లీకి, గడ్కరీకి చెరి రూ. 150 కోట్లు చేరితే… రాజ్ నాథ్ సింగ్ కు రూ. వంద కోట్లు వెళ్లాయని, ఆడ్వాణీ, జోషీకి చెరి రూ. యాభై కోట్లు పంపారని కాంగ్రెస్ అంటోంది. యడ్యూరప్ప స్వయంగా తన డైరీలో ఈ విషయం రాశారని, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్నాయని చెబుతోంది. ఈ వ్యవహారం మొత్తాన్ని కొత్తగా ఏర్పాటైన లోక్ పాల్ చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ నిత్యం తనను చౌకీదార్ అని చెప్పుకుంటారని, చౌకీదార్ చోర్ హై అన్న ఆరోపణలు నిజం కాకుండా ఉండాలంటే విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ కోరుతోంది. నిజానికి ఇది… కారవాన్ అనే పత్రికలో వచ్చింది. యడ్యూరప్ప డైరీలోని కొన్ని పేజీలను కూడా మీడియాకు విడుదల చేసింది. అవన్నీ యడ్యూరప్పపై సీబీఐ, ఐటీ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నవని.. కాంగ్రెస్ చెబుతోంది. యడ్యూరప్ప మాత్రం ఈ ఆరోపణలను తోసి పుచ్చుతున్నారు. తన డైరీ అంటూ అప్పట్లో కొన్ని కథనాలు వచ్చిన మాట వాస్తవమేనని అయితే అవి నకిలీ డాక్యుమెంట్లు అని ఆదాయ పన్ను శాఖ తేల్చిందని ఆయన వెల్లడించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందన్నారు.
గతంలోనూ.. దేశ రాజకీయాలు.. ఇలా డైరీల చుట్టూ తిరిగాయి. గతంలో ఇలాంటివి బయటపడినప్పుడు కనీసం విచారణ జరిగేది. ఇప్పుడు.. అలాంటి అవకాశం లేదు. కాంగ్రెస్ హయాంలో మంత్రులపై ఆరోపణలు వస్తే.. జైళ్లకు కూడా వెళ్లారు కానీ… బీజేపీ హయాంలో మాత్రం.. అలాంటి ఎన్ని ఆరోపణలు వచ్చినా.. మోడీ.. చౌకీదార్‌గా మారిపోతున్నారనే విమర్శలను కాంగ్రెస్ చేస్తోంది.