ఆరు నెలల క్రితం లోక్ సభ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం అంచనాలు తలకిందులయ్యాయి. రెండు రాష్ట్రాల్లో గతం కంటే తక్కువ సీట్లు రావడం బీజేపీని ఇరకాటంలో పడేస్తోంది. జాతీయవాదంతో నెగ్గుకురావాలన్న బీజేపీ ప్రయత్నం ఫలించలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్టికల్ 370 రద్దుపై బీజేపీ చేసుకున్న ప్రచారాన్ని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. పోలింగ్ ముందు రోజు కూడా ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరిపినప్పటికీ ఫలితం అనుకున్నట్లుగా రాలేదు.
నిజానికి మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీకి పోటీ లేదు. ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర నాయకత్వం లోపంతో బాధపడుతోంది. ముందుండి నడిపించేవారు లేరు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఐక్యత లేదు. అసలు కాంగ్రెస్ రేసులోనే లేదని ముందుగానే తీర్మానించుకున్నారు. కానీ ఫలితాల్లో మాత్రం.. బీజేపీ వ్యతిరేకత స్పష్టంగా కనిపించడంతో.. కాంగ్రెస్ పుంజుకున్నట్లుగా స్పష్టమయింది. హర్యానాలో గట్టిపోటీనివ్వడం, ఇటు మహారాష్ట్రలో గౌరవప్రదమైన స్థానాలు సాధించడం వెనుక రెండు రాష్ట్రాల ఓటర్లలో కాంగ్రెస్ పట్ల నమ్మకం సడలిపోలేదని అర్థమవుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నిలిచి గెలవాలన్న తపన కాంగ్రెస్ నేతల్లో కనిపించలేదు. తమను గెలిపించాలని జనం దగ్గరకు వెళ్లి అడిగిన దాఖలాలు కనిపించలేదు. రెండు రాష్ట్రాల్లో మోడీ 30 నుంచి 40 ప్రచారసభల్లో పాల్గొనగా.. రాహుల్ కేవలం ఏడెనిమిది సభల్లోనే ప్రసంగించారు. సోనియా అసలు ప్రచారమే చేయలేదు.
మొత్తంగా ప్రభంజనం లాంటి ఫలితాలు వస్తాయనుకుంటే… బీజేపీకి గట్టిగా సంబరాలు చేసుకోలేని ఫలితం వచ్చింది. మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా.. అవి సంకీర్ణాలే. ప్రాంతీయ పార్టీలను అమాంతం మింగేసి.. తమను తాము బలపరుచుకోవాలనే చేసే ప్రయత్నాలు.. బీజేపీకి చిక్కులు తెచ్చి పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు.. హర్యానాలో జేజేపీ, మహారాష్ట్రలో శివసేన డిమాండ్లకు తలొగ్గుతూ ప్రభుత్వాల్ని నడపాలి. లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. రెండు రాష్ట్రాల్లో అతి పెద్ద పార్టీలుగా అవతరించినా.. ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ .. ప్చ్..!