సదావర్తి సత్రవ భూముల కుంభకోణం వ్యవహారంలో రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాల రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు. ఆ ఫైలుపై సంతకం చేయకుండానే ముఖ్యమంత్రికి పంపించినట్లు తాజా సమాచారం. అంటే ఆ వ్యవహారాన్ని తను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పినట్లే భావించవచ్చు. ఆయన దేవాదాయ శాఖకి మంత్రిగా ఉన్నందున సదావర్తి సత్రవ భూముల అమ్మకం గురించి ముందుగా ఆయనకి తెలియజేసి, ఆయన అనుమతిస్తేనే ముందుకు సాగవలసి ఉంటుంది. కానీ ఆ వ్యవహారమంతా ఆయన అనుమతి, ప్రమేయం లేకుండానే సాగింది. ఒకవేళ ఆ కుంభకోణం విషయం బయటకి పొక్కకపోయుంటే ఆయన ఏవిధంగా స్పందించి ఉండేవారో తెలియదు కానీ దానిపై చాలా రాద్దాంతం జరిగిన తరువాత కూడా ఆ ఫైలుపై సంతకంపెడితే తన అనుమతితోనే ఆ కుంభకోణం సాగినట్లు దృవీకరించినట్లు అవుతుంది. ఆయన భాజపా సభ్యుడు కనుక ఆ కుంభకోణానికి భాజపా ఆమోదం కూడా ఉన్నట్లవుతుంది. కనుకనే ఆయన ఆ ఫైలుపై సంతకం చేసి ఉండకపోవచ్చు. ఆయన సంతకం లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన ఆ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేసి ఆమోదించవచ్చు. అప్పుడు అందుకు ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కుంభకోణంపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆయన మంత్రులు గానీ స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
చెన్నై సమీపంలో మహాబలిపురం వద్ద సదావర్తి సత్రవకి 83 ఎకరాలున్నాయి. వాటి ఖరీదు కనీసం 1,000 కోట్లు పైమాటేనని వైకాపా వాదిస్తోంది. అంత విలువైన భూములని చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్రమణలకి గురౌతున్నాయనే సాకుతో గుట్టుగా వేలం వేసేస్తే వాటిని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ్య, మరికొందరు తెదేపా పెద్దలు కలిసి కేవలం రూ.22 కోట్లకే స్వంతం చేసుకొన్నారని వైకాపా వాదిస్తోంది. దాని ఆరోపణలకి తెదేపా నేతలు ఎవరూ సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోవడం గమనిస్తే వైకాపా వాదనలు నిజమని స్పష్టం అవుతోంది. అందుకే మంత్రి మాణిక్యాల రావు ఆ ఫైలుపై సంతకం చేయలేదు.