రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయితే సగం మంది కాంగ్రెస్ సీనియర్లు తమ పార్టీలోకి దూసుకొచ్చేస్తారని.. ఇక హౌస్‌ఫుల్లే అనుకున్న బీజేపీకి ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. రేవంత్ పదవి చేపట్టడం ఖాయమైనా ఒక్కరంటే ఒక్క సీనియర్ కూడా బీజేపీ వైపు చూడటం లేదు. అసలు రేవంత్ విషయంలో ఎలా స్పందించాలో తెలియక బీజేపీ నేతలు సతమతమవుతున్నారు. కామ్‌గా ఉంటున్నారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ పదే పదే చెప్పుకుంటోంది. దుబ్బాకలో గెలచిన తర్వాత ఊపు వచ్చినా.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పరాజయాలతో చల్లబడిపోయారు. ఇప్పుడు హుజూరాబాద్‌పై ఆశలు పెట్టుకున్నారు
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిమించటంతో కాంగ్రెస్ సీనియర్లు లోలోన రగిలిపోతున్నారు. అయితే వీరు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరే అవకాశాలు లేవు. సీనియర్లే కాకుండా వివిధ జిల్లాలకు చెందిన అనేక మంది కాంగ్రెస్ నేతలకు గాలం వేయాలని కమలం పార్టీ ప్లాన్ చేసింది. అయితే రేవంత్ రెడ్డి చాణక్యం ప్రదర్శిస్తున్నారు. ఆయనను వ్యతిరేకించిన వారంతా ఒక్కొక్కరుగా ఆయనకే మద్దతు తెలుపుతున్నారు. అంతే కాదు.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు.. మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కుమారుడు రితేష్ రాథోడ్, బోడ జనార్ధన్ ఇతరులు ఇప్పటికే రేవంత్‌ను కలిశారు.
పీసీసీ అధ్యక్షుడి నియమితమైన వెంటనే రేవంత్ రెడ్డి బీజేపీని టార్గెట్ చేస్తు విమర్శలు చేశారు. రేవంత్ విమర్శలకు బీజేపీ నుంచి ప్రతి విమర్శలు రాలేదు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే… ఆయనను పెద్దవాడిని చేసినట్లు అవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 0వంత్ రెడ్డి ట్రాప్ లో పడకూడదని అనుకుంటున్నారు. తమకు ప్రత్యర్థి టీఆర్ఎస్సేనని కాంగ్రెస్ కాదని బీజేపీ అనుకుంటోందంటున్నారు. రేవంత్ రెడ్డిని గుర్తించకుండా.. కళ్లు మూసుకుంటే చాలు అన్నట్లుగా బీజేపీ ఉండటం.. ఆ పార్టీ క్యాడర్ని కలవరపాటుకు గురి చేస్తోంది.