అమరావతినే రాజధానిగా ఉండాలనేది బీజేపీ విధానం. కానీ కేంద్రంలో అధికార పార్టీగా బీజేపీ జోక్యం చేసుకోదు… ఇదీ కూడా బీజేపీ అభిప్రాయమే. అర్థం అయినా కాకున్నా… ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు ఇదే క్లారిటీ ఇచ్చారు. రాజధాని విషయంలో… అసలు కేంద్రానికి సంబంధం లేదని.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమన్నారు. తమకు మాత్రం.. అమరావతినే రాజధానిగా ఉండాలన్నది కోరికని తేల్చేశారు. కేంద్రం జోక్యం లేకుండా.. రాష్ట్రాల రాజధానుల ఎలా ఏర్పడుతున్నాయన్న విషయానికి మాత్రం ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. కానీ రాజధాని విషయంలో మాత్రం.. కేంద్రం జోక్యం చేసుకోదని.. జగన్ చేసుకోవాలన్నది చేసుకోవచ్చని… బీజేపీ క్లారిటీ ఇచ్చేసింది.
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టారు. అమరావతిని ఏపీ సర్కార్ అంగుళం కూడా కదిలించబోదని… సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ప్రకటించారు. ఇది ఆయన చాలా కాలంగా చెబుతున్నదే. ఇలా సుజనా చౌదరి చెప్పగానే అలా బీజేపీ నుంచి క్లారిటీ వచ్చింది. సుజనా చౌదరి వ్యక్తం చేసినవి వ్యక్తిగత అభిప్రాయాలేనని.. పార్టీ విధానం క్లియర్ గా ఉందని.. చెప్పుకొచ్చింది. సోము వీర్రాజు చెప్పిన మాటలే… బీజేపీ విధానమని… స్పష్టత ఇచ్చారు. నిజానికి అంతకు ముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మినారాయణ… మాటలే తమ పార్టీ విధానం అని.. గతంలో ఎప్పుడూ చెప్పలేదు.
ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన ప్రాజెక్టుకు ఈ గతి పడుతున్నా బీజేపీ నేతలు.. ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని వస్తున్న విమర్శలకు సోము వీర్రాజు భిన్నమైన కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆహ్వానిస్తనే.. మోడీ వచ్చారని చెప్పుకొచ్చారు. ఎవరైనా ఆహ్వానిస్తేనే వస్తారు…వచ్చినంత మాత్రాన.. అమరావతికి కట్టుబడి ఉండాలని లేదన్నట్లుగా ఆయన చెప్పుకొస్తున్నారు. అమరావతి రైతులకు మాత్రం.. అన్యాయం జరగకుండా పోరాడతామని కొత్త కోణం ఆవిష్కరించారు. అక్కడ రాజధాని ఉంటేనే.. రైతులకు న్యాయం జరుగుతుంది.. లేకపోతే అన్యాయమేనని.. అందరూ చెబుతున్నమాట. బీజేపీకి ఈ విషయం ఎప్పటికి అర్థం అవుతుందో మరి..!