కర్నాటక రాష్ట్ర భాజపా అధ్యక్షునిగా ఎడ్యూరప్పని నియమించిన అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో చాలా శక్తివంతమయిన లింగాయత్ కులస్థులలో మంచి పలుకుబడి ఉన్న అతనికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినట్లయితే, వచ్చే ఎన్నికలలో భాజపాని మళ్ళీ అధికారంలోకి తీసుకురాగలరనే ఆశతోనే భాజపా అంత దైర్యం చేసింది. కానీ, అవినీతి ఆరోపణల కారణంగా 2012లో పార్టీకి రాజీనామా చేసి ‘కర్నాటక జనతా పక్ష’ అనే స్వంత కుంపటి పెట్టుకొని, అసెంబ్లీ ఎన్నికలలో భాజపాకి సైంధవుడిలాగ అడ్డుపడి అధికారంలోకి రాకుండా చేసినవాడు, అవినీతి ఆరోపణల కారణంగా జైలుకి కూడా వెళ్ళివచ్చిన అతనికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు భాజపాను విమర్శించేందుకు ప్రతిపక్షాలకి మంచి అవకాశం కల్పించినట్లయింది. ఒకప్పుడు అతనితో వేదిక పంచుకోవడానికి కూడా ఇష్టపడని నరేంద్ర మోడీ, ఇప్పుడు అతనికే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడం విశేషం. దేశం నుంచి అవినీతిని పారద్రోలుతామని నిత్యం చెప్పుకొనే మోడీ, అత్యంత అవినీతిపరుడుగా పేరుమోసిన ఎడ్యూరప్పకే పార్టీ పగ్గాలు అప్పగించడంతో కర్ణాటకలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
“భాజపా అసలు గుణం, రూపం ఏమిటో ఈవిధంగా బయటపడింది. ఎడ్యూరప్ప నియామకం ద్వారా అర్ధమవుతున్నదేమిటంటే, అవినీతి విషయంలో భాజపా వైఖరి అప్పుడూ ఇప్పుడూ ఒక్కలాగే ఉందని! అతను అవినీతిపరుడనే కారణం చేతనే పార్టీ నుంచి బయటకి సాగనంపి మళ్ళీ రెండు సంవత్సరాలు తిరక్కుండానే ఆయన పార్టీలోకి తెచ్చుకోవడం, మళ్ళీ ఇప్పుడు అతనికే పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా భాజపా అవినీతిపరులు, నేరస్తులను అక్కున చేర్చుకొంటున్నట్లు స్పష్టమయింది. దానికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని జనతా దళ్ (ఎస్) నేత దనీష్ అలీ విమర్శించారు.
ఎడ్యూరప్ప ఎంపిక సమయం విషయంలో కూడా భాజపా చాలా పొరపాటే చేసిందని చెప్పవచ్చును. నాలుగు రాష్ట్రాలకి, పుదుచ్చేరి శాసనసభలకి ఎన్నికలు మొదలయిన సమయంలో అతనిని ఎంపిక చేయడం వలన, ఎన్నికల ప్రచార సభలలో ప్రతిపక్షాలు ఈ విషయం గురించి ప్రస్తావించడానికి స్వయంగా అవకాశం కల్పించినట్లయింది. ప్రధాని నరేంద్ర మోడి ఒకవైపు అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతూ, మరోవైపు అవినీతిపరుడికే పార్టీ పగ్గాలు అప్పజెప్పడం ద్వారా భాజపా అధికారం కోసం ఎంతకయినా దిగజారుతుందని ప్రతిపక్షాలు విమర్శించడం తధ్యం. వారి విమర్శలకు ప్రధాని నరేంద్ర మోడి జవాబు చెప్పుకోనవసరం లేకపోవచ్చును కానీ వాటి వలన భాజపాకి తప్పకుండా ఎంతో కొంత నష్టం కలిగించడం తద్యం.