కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ తీసుకుని ముస్లింలకు పంచుతుందని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ చర్చ రాను రాను భిన్నమైన టర్న్ తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ వ్యహాత్మకంగా ఆస్తుల పంపకం అనే వివాదాన్ని పేదల వైపు మళ్లించింది. శామ్ పిట్రోడా అనే కాంగ్రెస్ పెద్ద మనిషి అమెరికాలో ఆస్తి విధానం గురించి మాట్లాడారు. దాన్ని బీజేపీ తమకు అనుకూలం అనుకుని మరింత వైరల్ చేసింది. కానీ ఇందులోనే కాంగ్రెస్ వ్యూహం కనిపిస్తోంది.
ఇప్పుడు రాజకీయం అంతా కొంతమందికి వ్యతిరేకంగా మెజార్టీని కూడగట్టడమే అన్నట్లుగా సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ హిందూ, ముస్లిం వాదన ఎత్తుకుంటోంది. దీన్ని కాంగ్రెస్ అమలు చేయలేదు. అందుకే బీజేపీ చేసిన వాదనల్లో పేద, ధనిక మధ్య పోటీ తరహాలో తెచ్చేందుకు వ్యూహం పన్నింది. ఆ అస్త్రం కూడా బీజేపీనే ఇచ్చింది. ఆస్తులు పంచేస్తారని కాంగ్రెస్ తరపున బీజేపీ ప్రచారం చేయడం ప్రారంభించింది. ఎవరి ఆస్తులు పోతాయని భయపడతారో లేదో కానీ.. పేదలు మాత్రం ఆశపడే అవకాశం ఉంది. అదే జరిగితే ఎవరికి నష్టం ?
బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్ పార్టీ ఓట్ల పోలరైజేషన్ ప్లాన్ చేసుకుంది. తాము హామీ ఇస్తున్నామని ఎక్కడా చెప్పడం లేదు. బీజేపీ చేస్తున్న ప్రకటనలతోనే తమ పని పూర్తి చేసుకుంటోంది. ఇది బీజేపీకి ఊహించని నష్టం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ ఫేక్ నెరెటివ్ తో ఎదుటి పార్టీని దెబ్బకొట్టాలని అనుకుంటే..అది బూమరాంగ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. అలా తీసుకోలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే బీజేపీ .. కాంగ్రెస్ కు ఆస్తుల పంచుడు అనే అస్త్రం ఇచ్చేసింది. ఇది కొట్టే దెబ్బను బీజేపీ ఎలా కాచుకుంటుందో మరి !