రేపు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో కొన్ని రోజుల క్రితమే ఎన్నికలు ముగిసాయి. వాటన్నిటి ఫలితాలు ఈనెల 19న వెలువడబోతున్నాయి.
ఒక్క అసోంలో తప్ప మరెక్కడా భాజపా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవనే దాదాపు స్పష్టం అయ్యింది. అసోంలో కూడా భాజపాకి 50 శాతం మాత్రమే అవకాశాలున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికలలో, ఆ తరువాత జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికలలో తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తున్న భాజపాకి మొదట డిల్లీలో అ తరువాత బిహార్ లో ఎదురుదెబ్బలు తగిలాయి. సర్వే ఫలితాల ప్రకారం చూస్తే ఈ ఎన్నికల ఫలితాలు కూడా భాజపాకి తీవ్ర నిరాశ కలిగించవచ్చని స్పష్టం అవుతోంది. అయితే ఆయా రాష్ట్రాలలో కులం, బాష, ప్రాంతీయ పార్టీల ప్రభావం వగైరా అంశాలు భాజపాకి అడ్డుగోడలాగ మారడం వలననే అది వాటిని అధిగమించలేక చతికిల పడుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో భాజపాకి ఆ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. కేరళ, తమిళనాడులో రాష్ట్రాలలో భాజపా ఎన్నికల ప్రచార వ్యూహాలు గమనించినట్లయితే, ఆ సమస్యలను అధిగమించేందుకు భాజపా వద్ద ప్రత్యేక వ్యూహాలు ఏవీ లేవని స్పష్టం అయ్యింది.
కేవలం దక్షిణాదినే కాక ఉత్తరాదిన కూడా భాజపాకి అటువంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశాలున్నాయని బిహార్ ఎన్నికలు రుజువు చేసాయి. గురువారం వెల్లడయ్యే ఫలితాలతో మళ్ళీ మరొకమారు నిరూపితం అవవచ్చు. కనుక ఉత్తరప్రదేశ్, కర్నాటక, గుజరాత్ ఎన్నికల కోసం భాజపా ఎటువంటి వ్యూహాలను సిద్దం చేసుకొంటుందో చూడాలి. మోడీ హయాంలో దేశంలో మత అసహనం పెరిగిపోయిందని కాంగ్రెస్ మిత్రపక్షాలు పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారం, దానిని బలపరిచేవిధంగా జె.ఎన్.యు. విద్యార్ధి కన్నయ్య కుమార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి వేముల రోహిత్ ఆత్మహత్య కేసులో మోడీ ప్రభుత్వ వ్యవహారించడం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికయిన ప్రభుత్వాలను కూల్చడానికి కుట్రలు పన్నడం వంటివన్నీ మోడీ పట్ల, ఆయన ప్రభుత్వం పట్ల దేశప్రజలలో వ్యతిరేకతని పెంచేయని చెప్పక తప్పదు. అయినప్పటికీ తాజా సర్వేలో మోడీ ప్రభుత్వం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలలో 50 శాతంపైగా ప్రజలు సానుకూలంగా ఉన్నారనే విషయం భాజపాకి చాలా ఊరట కలిగించేదే. కానీ మిగిలిన 48 శాతం మందిలో వ్యతిరేకత ఉంది కనుక భాజపా అప్రమత్తం అవవలసిన అవసరం కూడా ఉందని స్పష్టమవుతోంది. దేశ ప్రజలలో మోడీ ప్రభుత్వం పట్ల ఇంకా సానుకూలత కనబడుతున్నప్పటికీ, కులం, మతం, బాష, ప్రాంతీయవాద పార్టీల ప్రభావం వంటి అవరోధాలను అధిగమించలేక భాజపా చతికిలపడుతుండటం విచిత్రంగానే ఉంది.